Home AP చీరాల లో ఇసుక మాఫియాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం

చీరాల లో ఇసుక మాఫియాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం

  • ఉచిత ఇసుక పథకం అమలుపై అధికారులకు సీఎం హెచ్చరిక
  • నెల రోజుల్లో పరిస్థితి మారకపోతే నేరుగా రీచ్‌ల వద్దకే వచ్చి పంచాయితీ పెడతా -సీఎం చంద్రబాబు

చీరాల, ఆగష్టు 07:
రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని నీరుగారుస్తూ, అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న అధికారుల తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలోనే తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రభుత్వానికి వచ్చే వేలాది కోట్ల రూపాయల ఆదాయాన్ని సైతం త్యాగం చేసి, పేదలకు ఉచితంగా ఇసుక అందించాలన్న ఉద్దేశంతో పథకాన్ని తీసుకువస్తే.. అధికారుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం వల్ల పథకం లక్ష్యం దారితప్పుతోందని మండిపడ్డారు.

బాపట్ల జిల్లా చీరాల లో జరిగిన చేనత సదస్సు లో అధికారులతో సమీక్షించిన సిఎం చంద్రబాబు ఉచిత ఇసుక సరఫరా లో జరుగుతున్న అక్రమాల పై అధికారులను తీవ్రస్థాయిలో నిలదీశారు. రీచ్‌లలో ఏమైనా సిండికేట్లు, దొంగ వ్యాపారాలు నడుస్తున్నాయా? అని ప్రశ్నించగా.. అధికారులు అలాంటిదేమీ లేదు సార్ అంటూ నిజాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అధికారుల కల్లబొల్లి మాటలను ఏమాత్రం నమ్మని ముఖ్యమంత్రి.. నేరుగా సభలోని వేలాది మంది ప్రజలను ఇక్కడ సాండ్ మాఫియా ఉందా? ఉన్నట్లయితే ధైర్యంగా చేతులు పైకెత్తండి అన్నారు. అంతే.. క్షణాల్లో సభలోని జనం ఏకకంఠంతో చేతులెత్తి ఉంది అని గట్టిగా చెప్పారు.
ప్రజల బహిరంగ సాక్ష్యంతో అధికారులకు ఆఖరి హెచ్చరిక జారీ చేశారు. ప్రజాధనాన్ని త్యాగం చేసి పథకం తెస్తే, మీ నిర్లక్ష్యం వల్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ తీరును ఎంతమాత్రం సహించేది లేదు అని స్పష్టం చేశారు.పరిస్థితిని చక్కదిద్దడానికి సరిగ్గా ఒక నెల రోజులు మాత్రమే గడువు ఇస్తున్నానని, ఆ తర్వాత మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. అప్పటికీ తీరు మారకపోతే ఏకంగా ఇసుక రీచ్‌ల వద్దకే స్వయంగా వచ్చి సాండ్ పంచాయితీ పెడతానని, ఇసుక దోపిడీకి పాల్పడే అక్రమార్కులు ఎంతటి వారైనా సహించేది లేదని హెచ్చరించారు.

 

#ChandrababuNaidu #AndhraPradesh #FreeSandPolicy #SandMafia #IllegalSandMining #SandReaches #Bapatla #Chirala #APGovernment #SandPolicy #Governance #PublicMeeting #PoliticalNews #BreakingNews #LatestNews #TeluguNews #AndhraNews #CMChandrababu #AntiCorruption #SandScam