రేవంత్ సర్కారుపై హరీశ్ రావు ఆగ్రహం .
బోడుప్పల్ పరిధిలోని తిరుమల మెడోస్, లక్ష్మీ గణపతి కాలనీ, హేమానగర్ కాలనీలకు చెందిన 22ఏ బాధితులను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు కలిశారు. సర్వే నంబర్ 215, 215 పార్ట్‌లలో సుమారు 1,500 కుటుంబాలు మూడు దశాబ్దాలుగా ఎలాంటి వివాదాలు లేకుండా నివసిస్తున్నాయని తెలిపారు. అలాంటి ఇళ్లను రాత్రికి రాత్రే అర్బన్ ల్యాండ్ సీలింగ్ పేరుతో 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం దారుణమని మండిపడ్డారు. ఇల్లు అమ్ముకోవడానికి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లినప్పుడు ఆస్తి ప్రొహిబిషన్‌లో ఉందని తెలియడంతో బాధితులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని చెప్పారు. నిషేధిత జాబితా పేరుతో ప్రజల ఆస్తులను కబ్జా చేసే అధికారం ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని హరీశ్‌రావు ప్రశ్నించారు. చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయిన ఆస్తులపై కొత్త వివాదాలు సృష్టించి కమీషన్ల కోసం ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు.
తక్షణమే జాబితా నుంచి తొలగించాలి
దశాబ్దాలుగా ప్రశాంతంగా జీవిస్తున్న కుటుంబాలను ఇప్పుడు 22ఏ నిబంధన పేరుతో భయపెడుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. ఆస్తులపై నిషేధం విధించి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. బోడుప్పల్ బాధితులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 22ఏ సమస్య ఎదుర్కొంటున్న ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. బాధితుల ఆస్తులను కాపాడేందుకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆయా కాలనీలను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే బాధితుల తరఫున బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
#HarishRao #22ALands #22AProhibitedList #BhuBharati #RevanthReddy #TelanganaPolitics #BRS #Boduppal #LandDisputes #LandRegistration #UrbanLandCeiling #Telangana #RevanthGovernment #PoliticalNews #TelanganaNews











