సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు
ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ కోసం రూపొందించిన ఓ ప్రకటన ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. సాధారణ ప్రకటనలకు భిన్నంగా, మరణ ప్రకటనలను తలపించేలా యాడ్‌ను రూపొందించారు. జీవించి ఉన్న వ్యక్తుల ఫొటోలు, వ్యక్తిగత వివరాలను మెమోరియల్ బాక్సుల తరహాలో పెట్టడం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు కారణమైంది.
‘మరణం’ను మార్కెటింగ్‌కు వాడటంపై అభ్యంతరం
ప్రకటనలో పైభాగంలో తాము బాధపడటం లేదనే భావన వచ్చేలా సందేశం ఇచ్చారు. సేల్‌లో ఉన్న ఆఫర్లు ముగింపు దశకు చేరుకున్నాయనే విషయాన్ని చెప్పేందుకు మరణం, సంతాప ప్రకటనల తరహా విజువల్స్‌ను ఉపయోగించారు. అయితే వస్తువుల అమ్మకాలను ప్రోత్సహించేందుకు ఇలాంటి సున్నితమైన అంశాన్ని వాడటం సరికాదని పలువురు మండిపడుతున్నారు. రచయిత, కాలమిస్టు శోభా డే కూడా ఈ ప్రకటనపై తీవ్రంగా స్పందించారు. ఇది అత్యంత స్వార్థపూరిత, అసహ్యకరమైన, సున్నితత్వం లేని ప్రకటనగా అభివర్ణిస్తూ ఫ్లిప్‌కార్ట్‌పై విమర్శలు చేశారు. సేల్ విఫలమవ్వాలని, వినియోగదారులు సంస్థను బహిష్కరించాలని ఆమె పిలుపునిచ్చారు.
‘ఏఐ చిత్రాలే కదా’ అంటూ కొందరి సమర్థన
ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొందరు దీనిని అసహ్యకరమైన, అమానవీయమైన ప్రకటనగా అభివర్ణించారు. మరికొందరు మరణించిన వారి గౌరవాన్ని కూడా ఇలాంటి ప్రకటనల కోసం ఉపయోగించకూడదని వ్యాఖ్యానించారు. సృజనాత్మక బృందం, ప్రకటనకు అనుమతి ఇచ్చిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు. అయితే ప్రకటనను సమర్థించినవారు కూడా లేకపోలేదు. ఇందులోని ఫొటోలు ఏఐ ద్వారా రూపొందించినవే అయితే ఎవరికి నష్టం జరిగిందని కొందరు ప్రశ్నించారు. కానీ దీనికి కౌంటర్‌గా మరో వర్గం.. చిత్రాలు ఏఐతో రూపొందించినా, మరణాన్ని సేల్ ప్రమోషన్‌కు ప్రాతిపదికగా ఉపయోగించాలనే ఆలోచనే తప్పని స్పష్టం చేసింది.
అసలు వ్యక్తులా.. ఏఐ చిత్రాలా?
ప్రకటనలో కనిపిస్తున్న వ్యక్తులు నిజమైనవారా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. కొందరు నెటిజన్లు ఈ ప్రచారంలో ఏఐ సాయాన్ని ఉపయోగించారా అని కూడా ప్రశ్నించారు. అయితే వివాదానికి ప్రధాన కారణం చిత్రాలు నిజమైనవా కాదా అనేది కాకుండా.. మరణం, సంతాప ప్రకటనల భాషను వాణిజ్య ప్రచారానికి ఉపయోగించడమే.
ఈ వివాదంపై ఫ్లిప్‌కార్ట్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఈ ప్రకటన ఏయే పత్రికల ఎడిషన్లలో ప్రచురించిందన్న విషయంపైనా సంస్థ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో సోషల్ మీడియాలో విమర్శలు కొనసాగుతున్నాయి. అయితే సేల్ కంటే ఇప్పుడు వివాదాస్పద ప్రకటనపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది.
#Flipkart #FlipkartFreedomSale #FlipkartAd #AdControversy #Advertising #SocialMedia #SocialMediaBacklash #ShobhaaDe #AIImages #Marketing #BrandControversy #ViralAd #TrendingNews











