హక్కుదారులెవరో తేల్చేందుకు దర్యాప్తు
బెల్జియంలో మురుగు కాలువ పనులు చేస్తున్న 18 ఏళ్ల యువకుడికి ఊహించని అదృష్టం ఎదురైంది. సాధారణంగా పైపుల మార్పిడి కోసం భూమిని తవ్వుతుండగా భారీగా బంగారు నాణేలు, బంగారు ముక్కలు, బులియన్ బార్లు బయటపడ్డాయి. ఈ నిధి విలువ సుమారు 9 మిలియన్ యూరోలు.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.98 కోట్లు ఉంటుందని అంచనా.
పాత భవనం గోడలో రహస్యం
సింట్-గిల్లిస్-డెండర్‌మొండే ప్రాంతంలో వేసవి పనికి వెళ్లిన కోబే అనే 18 ఏళ్ల విద్యార్థి ఈ నిధిని గుర్తించాడు. నేలలో ఏదో కనిపించడంతో మొదట అవి యూరో నాణేలని భావించినట్లు చెప్పాడు. కొద్దిసేపటికే వాటిలో బంగారు బార్ కనిపించడంతో అసలు విషయం అర్థమైంది. ఇంత పెద్ద మొత్తంలో నిధి దొరుకుతుందని తాము ఊహించలేదని అతడు చెప్పాడు. ఈ బంగారం ఓ సంచిలో ఉంచి, ఇటుకలతో మూసిన నేలమాళిగ గోడలో దాచినట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రదేశంలో 19వ శతాబ్దం చివర్లో నిర్మించిన ఓ విల్లా ఉంది. అది అప్పట్లో బ్రూవరీ యజమాని థియోఫిలస్ వాన్ అస్చే కోసం నిర్మించిన భవనంగా తెలుస్తోంది. అక్కడ 1899లో ప్రారంభమైన బీరు తయారీ 1970 వరకు కొనసాగింది.
అధికారులు స్వాధీనం
ప్రస్తుతం ఆ పురాతన భవనాన్ని కావోస్ట్ వ్లాదరీన్ అనే సామాజిక సంక్షేమ సంస్థ పునర్నిర్మిస్తోంది. కార్యాలయాలు, నివాస వసతుల కోసం భవనాన్ని పూర్తిగా మారుస్తున్నారు. ఈ పనుల్లో భాగంగానే మురుగు కాలువల కోసం తవ్వకాలు చేపట్టగా, ఇన్నేళ్లుగా గోడలో దాగి ఉన్న బంగారం వెలుగులోకి వచ్చింది. నిధి బయటపడగానే అధికారులు ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బంగారం, నాణేలను సురక్షితంగా బ్రస్సెల్స్‌లోని ఓ భద్రతా కేంద్రానికి తరలించారు. ఈ నిధి ఎప్పుడు దాచారు? ఎవరు దాచారు? అది దొంగతనానికి సంబంధించినదా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
అదృష్టం దక్కుతుందా?
ఈ నిధిపై హక్కు ఎవరికి ఉంటుందన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. భవన నిర్మాణ సంస్థలు, సంక్షేమ సంస్థ, వాన్ అస్చే కుటుంబ వారసులు తమ హక్కును కోరే అవకాశం ఉంది. నిధికి అసలు యజమానులు ఎవరైనా ఉంటే వారు ముందుకు రావడానికి బెల్జియం చట్టం ప్రకారం కనీసం ఐదేళ్ల వ్యవధి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. నిధిని గుర్తించిన యువకుడికి చివరికి ఏదైనా బహుమతి లభిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంత పెద్ద మొత్తంలో బంగారం దొరికినందున దానిని తమ వద్ద ఉంచుకోలేమని పని చేస్తున్నవారికి తెలుసని కోబే చెప్పాడు. చిన్న మొత్తంలో నాణేలు దొరికితే పరిస్థితి వేరుగా ఉండేదేమో కానీ, ఇంత భారీ నిధి దొరికినందుకు ఏదో ఒక రూపంలో ఫైండర్ రివార్డ్ వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు.
#Belgium #GoldTreasure #GoldDiscovery #TreasureFind #GoldCoins #GoldBullion #HiddenTreasure #TreasureHunt #BelgiumNews #ViralNews #WorldNews #AmazingDiscovery #18YearOld #GoldFind











