• ఆ సమాధులు గత చరిత్రను చెబుతాయి
• 80 ఏళ్ల దేశం కోసం నిలిచి వెలిగిన కుటుంబ కథ
• తెలుగునాట వెలుగు చూడని ‘సేవా వలసలు’
• అవే వృత్తులకు సిద్ధమైన మూడో తరం!
అదిలాబాద్ జిల్లా లక్షెట్ పేట్ పట్టణంలోని సిఎస్ఐ చర్చి సమీపంలోని ‘సెమెట్రి’లోకి మీరు కనుక చూస్తే, ‘చోరగుడి’ అనే ఇంటిపేరుతో ఒకే రకం సమాధులు వరసగా కొన్ని కనిపిస్తాయి. అది అక్కడి ఇంటిపేరు కాదు. మరి ఎవరు వాళ్ళు? విశేషమైన ఆ చరిత్ర కాకినాడ రామారావు పేటలోని చోరగుడి వారి వీధి నుంచి మొదలయింది. చోరగుడి సంగమేశ్వర శాస్త్రి అక్కడ నుంచి కృష్ణాజిల్లా గుడివాడ సమీపాన దొండపాడు చేరితే, అతనికి ఆశ్రయం ఇచ్చిన వారితో కలిసి శాస్త్రి అక్కడే ఒక కుటుంబీకుడై స్థిరపడ్డాడు. ఆయన వచ్చిన కాలం ఏదో తెలియదు. కానీ కాకినాడకు తొలి బాప్టిస్ట్ మిషనరీలు 1874లో వస్తే, అదే కాలంలో దొండపాడు సీబీఎం చర్చి వ్యవస్థాపక పెద్దలుగా చోరగుడి కుటుంబీకులు ఉన్నట్టుగా చర్చి పాత పత్రికల్లో ఉంది. మరి శాస్త్రి క్రైస్తవానికి మారితే ఆ కారణంగా తన కుటుంబం అతణ్నిఇంటి నుంచి బయటకు పంపితే, ఆయన దొండపాడు వచ్చాడా? లేక కాకినాడ మిషనరీలు పనిపై పంపితే వచ్చాడో తెలియదు. ఏదేమైనా ఆయన ద్వారా ‘చోరగుడి’ ఇంటిపేరు గోదావరి జిల్లా అగ్రహారం నుంచి కృష్ణాజిల్లా కు చేరింది. అక్కడి వారే ఆ తర్వాత ఆ ఇంటిపేరుతో గన్నవరం, కోలవెన్ను వంటి మరికొన్ని సమీప గ్రామాలకు చేరారు.
అదలా ఉంచితే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదలైన ఈ దేశం తొలి గ్రామీణ అభివృద్ది ప్రాజెక్టుతో దానికి ‘లింకు’ ఉంది. అదెలా అంటే, 2 అక్టోబర్ 1952 నాటికి భారత ప్రభుత్వం ‘కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్’ (సీడీపీ) ప్రకటించింది. వాటిలో అదిలాబాద్ జిల్లాకు రెండు ఇచ్చారు. ఒకటి 1 ఏప్రెల్ 1956న లక్షెట్ పేట్, ఉట్నూర్ లలో ‘మల్టి పర్పస్ ప్రాజెక్ట్ బ్లాక్స్’ పేరుతో మొదలైతే; మరో రెండేళ్లకు చెన్నూరు, కడెం, సిర్పూర్ లలో మరో మూడు వచ్చాయి. ఒక్కొక్క ప్రాంతం అవసరాన్ని బట్టి అక్కడ విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, శానిటేషన్, గ్రామీణ మౌలిక వసతుల కల్పన అమలు వంటివి ఈ ప్రాజెక్టులో ఉండేవి. అలా లక్షెట్ పేట్ సమితి ‘మల్టి పర్పస్ ప్రాజెక్ట్’ లో పనిచేయడానికి వచ్చిన తొలి ఆంధ్ర ప్రాంత అధికారి కృష్ణాజిల్లా కోలవెన్నుకు చెందిన చోరగుడి జాకబ్ సుదర్శనం.
స్వచ్చందంగా:
వీరి తండ్రి జాకబ్ తల్లి మార్త. ఏడేళ్లకే తండ్రి చనిపోవడంతో తల్లి పెంపకంలో హైస్కూల్ చదువులు తర్వాత, అన్న సుదర్శనం తమ్ముడు జాన్ సుందరరావు (మా నాన్న గారు) ఇద్దరూ మిలటరీ ‘ఎడ్మినిస్ట్రేషన్ సర్వీస్’ లో చేరి పూనా, బొంబాయిలో పనిచేశారు. ఆ తర్వాత అన్న నూజివీడు డివిజన్ లో రెవెన్యూ ఇనస్పెక్టర్ గా, తమ్ముడు జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఆంగ్లం, సోషల్ స్టడీస్ టీచర్ గా జగ్గయ్యపేట, నందిగామ, పటమట, కోలవెన్నులో పనిచేశారు. ఆంధ్రాలో 1948-50 మధ్య కమ్యూనిస్టులపై మిలటరీ చర్య జరిగినప్పుడు, కాటూరు తర్వాత సైనికులు కోలవెన్ను వస్తే, వారిని ఆపడానికి సుదర్శనం తన ఇంటిముందున్న వేపచెట్టుపై జాతీయ జెండా ఎగరవేసి, ఊళ్ళోకి వచ్చిన మిలటరీ అధికారులతో తాను ఆంగ్లంలో మాట్లాడి, ఊళ్ళో ఎటువంటి సంఘటన జరగకుండా ఆపగలిగారు.
దేశంలో 1952లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది కోసం మొదలైన ‘మల్టి పర్పస్ ప్రాజెక్ట్’ పనిచేయడానికి సర్వీస్ లో ఉన్న ఉద్యోగుల నుంచి ప్రభుత్వం సమ్మతి కోరినప్పుడు, అందులో పనిచేయడానికి సుదర్శనం అంగీకరించారు. అలా కృష్ణాజిల్లా విడిచి ఆయన అదిలాబాద్ వచ్చారు. మళ్ళీ అక్కడ కూడా బాగా వెనకబడిన ప్రాంతమైన లక్షెట్ పేట్ వెళ్ళడానికి ఎవ్వరూ ముందుకు రాకపోతే, ‘సరే నేను వెళతాను’ అని సుదర్శనం అంగీకరించారు. అలా ఆయన లక్షెట్ పేట్ చేరి, ‘బ్లాక్ ఆఫీస్’ సమీపంలో చర్చి కాంపౌండ్ లో నివాసం ఉంటూ, రెండేళ్ల తర్వాత కోలవెన్ను నుంచి తన కుటుంబాన్ని లక్షెట్ పేట్ తెచ్చారు. అప్పటికే కోలవెన్నులో సీబీఎం స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్న వారి భార్య ప్రేమావతి అక్కడి ఉద్యోగం వదులుకుని, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులను తీసుకుని ఆమె స్వంత ప్రాంతం విడిచి సుదర్శనం వద్దకు చేరారు. తర్వాత ఆమెకు అదే ‘బ్లాక్ ఆఫీస్’ లో మహిళా సంక్షేమ సూపర్వైజరీ పోస్టు దొరికింది. సుదర్శనం 15 ఏళ్లపాటు ఈ కొత్త ‘ప్రాజెక్టు’ పనితీరు పంచాయతీలకు, ప్రజలకు పరిచేయం చేయడానికి గ్రామాల్లో బాగా తిరిగేవారు. అలా ఒక మండు వేసవిలో ‘క్యాంప్’లో ఉంటూ వడదెబ్బ తగిలి 25 మే 1967లో ‘డ్యూటీ’లోనే ఆయన కన్నుమూశారు.
భిన్నమైనది:
కోస్తాంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణకు జరిగే వలసలు అవి ఏ లక్ష్యంతో జరుగుతాయో మనకు తెలియంది కాదు. గడచిన ఇరవై ఏళ్ల రాష్ట్ర రాజకీయ పరిణామాలు అందుకు సజీవ సాక్ష్యం. ఈ వివాదం విషయంలో ఉండే స్పర్ధ చరిత్రలో మిగులుతుంది. అయితే దానికి ఇది పూర్తిగా భిన్నమైంది. సుదర్శనం పెద్ద కూతురు భారతి ఆంధ్రాలో ఏడు చదివితే, తెలంగాణలో ఎనిమిదితో మొదలైంది. పిల్లల చదువులు, తమ ఉద్యోగ బాధ్యతలు రెండూ కూడా తనకు ముఖ్యమే అని, ఆ తండ్రి ఆమెను ఆ కొత్త ప్రాంతంలో ఇంటికి 150 కిమీ దూరాన ఖాజీపేట్ లోని ‘ఫాతిమా కాన్వెంట్’ చేర్చారు. అక్కడ ఆమె ఇంగ్లీష్ మీడియంలో ‘పీయూసీ’ పాసైతే, ప్రభుత్వం వెంటనే ఆమెకు తన 17వ ఏట లక్షెట్ పేట్ ఉర్దూ మీడియం గర్ల్స్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ ఉద్యోగం ఇచ్చింది. ఆ స్కూల్లో ‘ఘోషా’ ఉండడంతో అక్కడ సంపన్నుల ఆడపిల్లలు చదివేవారు. అక్కడేమో వారికి ఆంగ్లం బోధించే మహిళా టీచర్ లేరు. దాంతో పై చదువులకు భారతి మరో చోటికి వెళ్ళడం కంటే ఉన్న ఊళ్ళో పదిమందికి ఆమె విద్య ఉపయోగపడడం ముఖ్యమని ఆ తండ్రి అనుకున్నారు. అలా పనిచేస్తూనే భారతి డిగ్రీ చదివి, బీఎడ్ టీచర్ గా పలు జిల్లాపరిషత్ హైస్కూళ్లలో సుదీర్ఘ కాలం పనిచేసి 2000లో రిటైర్ అయ్యారు.
వెతలతోనే సాగుతూ
సుదర్శనం అకాల మరణంతో ఆ కుటుంబానిది నడి సముద్రంలో చుక్కాని లేని ఓడ ప్రయాణమైంది. దుఖంతోనే ఇంటిని నెట్టుకొస్తున్న తల్లిని చూస్తూ, గుండెకు రంధ్రంతో పుట్టిన రెండవ కుమార్తె కళ్యాణికి ఆరోగ్యం క్షీణించి, మెరుగైన వైద్యం లేక ఎస్.ఎస్.ఎల్.సి. పాసైన ఆమె మే 1972లో తన 29వ ఏట కన్నుమూశారు. వీరి చివరి కుమార్తె నిర్మల గ్రాడ్యుయేట్ సైన్స్ టీచర్. ఆమె లక్షెట్ పేట్ తర్వాత- గోదావరి ఖని, మందమర్రి వంటి సింగరేణి బొగ్గుగనుల ప్రాంతాల్లోని హైస్కూళ్లల్లో పనిచేసి అక్కడి కలుషితమైన నీరు, అననుకూల వాతావరణంలో ఆరోగ్యం పాడై 47 ఏళ్ల వయస్సులోనే జులై 1999లో ఆమె మరణించారు. అది- స్వంత ప్రాంతం భాంధవ్యాలు వదిలి కొత్త చోటుకు వచ్చిన కుటుంబం కావడంతో, ఒంటరిదైన తల్లి సకాలంలో బిడ్డల వివాహాలు చేయలేకపోయింది. కృష్ణాజిల్లా మానికొండలో ఉండే ప్రేమావతి తల్లి ఇందుపల్లి రత్నమ్మ తన చివరి రోజుల్లో ఉన్న ఒక్క కూతురు వద్దకు చేరి, ఆమె కూడా ఇదే సమాధుల తోటలోకి చేరారు. సుమారు 40 ఏళ్లపాటు ఈ ప్రాంతంలో ఎందరికో విద్యాబుద్దులు నేర్పిన భారతి టీచర్ 85 ఏళ్ల వయస్సులో తోబుట్టువులు అందరినీ పోగొట్టుకుని, ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తున్నారు. ఊళ్ళో పూర్వ విద్యార్ధులు సమావేశమై కలిసినప్పుడు, వాళ్ళు ఆమె వద్దకు వచ్చి చేసే పలకరింపులు సత్కారాలతో ఆమె ‘రీఛార్జి’ అవుతూ కాలం వెళ్లదీస్తున్నారు.
కార్యసాధకులు
తండ్రి అకాల మరణం తర్వాత ఇక్కడ ఏ స్థిరాస్తులు లేనప్పుడు ఇక్కడ ఉండడం ఎందుకు మళ్ళీ ఆంధ్రకు స్వంత ఇంటికి తిరిగి వెళితే రక్తసంబంధుల మధ్యకు చేరవచ్చు అని అ ఇంటిలో ఎవ్వరూ అనుకోలేదు. జీవనపోరాటం ఎక్కడున్నా తప్పదు, నాన్న తాను వస్తూ మనల్ని ఇక్కడికి తెచ్చాక, ఇక మనం ఏమిటి అనేది మనం ఇక్కడే నిరూపించాలి అని ఉండేదేమో సుదర్శనం కొడుకులు ఇద్దరూ ఊరి నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి చేరారు. లక్షెట్ పేట్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో 1977 నాటికి ఇద్దరే లాయర్లు ఉంటే, సుదర్శనం రెండవ కొడుకు ప్రభాకర్ ఎల్.ఎల్.బి. డిగ్రీతో ఊరికి తిరిగివచ్చి, తన 28వ ఏట పట్టణంలో మూడవ అడ్వకేట్ గా రిజిస్టర్ అయ్యాడు. అందరితో- ‘వకీల్ సాబ్’ అని పిలిపించుకుంటూ 1977-2023 మధ్య 46 ఏళ్లు నిరాటంకంగా వృత్తిలో నిలిచారు. అలా ఏ కుటుంబ నేపధ్యం లేకుండానే ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రాంతంలో న్యాయ సలహాదారు అయ్యారు. అస్వస్థతో 75 ఏళ్ల వయస్సులో జులై 2024 న ఆయన కన్నుమూశారు. వీరి సతీమణి ఎలిజబెత్ (కరీంనగర్) స్థానిక ప్రభుత్వ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేశారు. సైన్స్ లో పీజీ చేసిన వీరి కుమార్తె ప్రీతిక పెళ్లయ్యాక హైదరాబాద్ లో స్థిరపడ్డారు.
పది రోజుల క్రితం 82 ఏళ్ళకు కన్నుమూసిన సుదర్శనం పెద్ద కుమారుడు డా. ప్రసన్న కుమార్ 25 ఏళ్లకే 70 ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్. ప్రొ. జి. హరగోపాల్ వంటి మానవ హక్కుల నేతలు, మరి కొందరు మాజీ ఐఎఎస్ లు క్యాంపస్ లో అప్పటి ప్రసన్న క్లాస్మేట్స్. కానీ ఉద్యోగం ప్రధానమై నవంబర్ 1969 నాటికే ఆయన అధ్యాపక వృత్తిలో చేరి, కృష్ణాజిల్లా ఈలప్రోలుకు చెందిన టీచర్స్ కుమార్తె సరళను 1978లో వివాహం చేసుకున్నారు. ప్రసన్న హైస్కూల్, జూనియర్, డిగ్రీ కాలేజిల లెక్చరర్ గా లక్షెట్ పేట్, ఉట్నూర్, గోదావరి ఖని, ధర్మపురిలో, ఖానాపూర్, నిర్మల్ పట్టణాలలో పనిచేశారు. అయితే, ప్రసన్న జ్ఞానతృష్ణ అక్కడ ఆగలేదు. తొలుత జీవనోపాధి ముఖ్యమై ఆయన ఉద్యోగంలో చేరినా, చదివిన ‘పొలిటికల్ సైన్స్’ మీద మక్కువతో ఔరంగాబాద్ లోని మరట్వడా యూనివర్శిటీలో స్కాలర్ గా చేరి, ప్రొ. ఖాజా హాబీబుద్దీన్ పర్యవేక్షణలో1992 నాటికి పి.హెచ్.డి. పూర్తి చేశారు.
అయితే, ప్రసన్న తన రీసెర్చ్ కోసం తీసుకున్న విషయం దాన్ని ఆయన ‘థీసిస్’గా యూనివర్సిటీకి సమర్పించిన కాలం మన దేశ చరిత్రలో ఎంతో కీలకమైంది. అద్వానీ రధయాత్ర 1990 సెప్టెంబర్ లో మొదలయి యావత్ దేశం దృష్టిని అది అటు మళ్లించింది. అప్పటికే ప్రసన్న పరిశోధన అంశంగా- ‘ఫండమెంటలిజం అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఇన్ ఇండియా’ అంశంపై పరిశోధన చేస్తున్నారు. ఇంతలో 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది. దాంతో దేశమంతా అల్లర్లు హింస చెలరేగడం తెలిసిందే. ఆ ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రసన్న ఔరంగాబాద్ యూనివర్శిటి క్యాంపస్ లో ఉన్నారు. దాంతో ప్రసన్నకుమార్ క్షేమం కోసం ఆయన ‘గైడ్’ స్వయంగా తన కారులో స్కాలర్స్ హాస్టల్ నుంచి స్టేషన్ కు తీసుకువచ్చి లక్షెట్ పేట్ వెళ్ళడానికి రైలు ఎక్కించారు. మరో ఏడాది తర్వాత ప్రసన్న కుమార్ కు డాక్టరేట్ ప్రధానం జరిగితే, ఆ వెంటనే ఆయన ఉస్మానియా నుంచి ఎల్.ఎల్.బి., నాగార్జున యూనివర్శిటీ నుంచి ఎల్.ఎల్.ఎం. చేశారు. ప్రసన్న ఎప్పుడైనా అత్తగారి ఇంటికి విజయవాడ వస్తే, సాయంత్రం వేళ
ఆయన ఉండేది ఏలూరు రోడ్డు పుస్తకాల షాపుల్లోనే!
ఉపాధ్యాయ వృత్తి నుంచి రిటైరైన వెంటనే ప్రసన్న కుమార్ లక్షెట్ పేట్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో అడ్వకేట్ గా తన పేరు రిజిస్టర్ చేయించుకున్నారు. అది మొదలు 22 ఏళ్లపాటు చురుకైన న్యాయవాదిగా నిరుపేద, బడుగు వర్గాల గొంతుగా కోర్టుల్లో వారికి న్యాయం జరగడానికి కృషిచేస్తూ, తను తీసుకున్న ప్రతి కేసు ఆయన గెలిచారు అంటే, ప్రసన్న ప్రతిభ ఎటువంటిదో స్పష్టం అవుతుంది. సుదర్శనం కుటుంబంలో ఇప్పుడు భారతి ఒక్కరే చివరి ప్రతినిధిగా మిగిలారు. మారుతున్న కాలంలో మూడవ తరంలోని పిల్లలు ఇంకా ఈ వెనుకబడిన చోట మనం ఎందుకని ఏ హైదరాబాద్ వైపో చూడకుండా, ప్రసన్నకుమార్ పిల్లలు ఇద్దరూ లక్షెట్ పేట్ లోఉంటున్నారు. కుమార్తె కళ్యాణి కాగజ్ నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ గా పనిచేస్తుంటే, అక్కడే ఆమె భర్త డా. విద్యాసాగర్ ‘విజేత’ పిల్లల ఆసుపత్రి నడుపుతూ పేదలకు ఆర్తితో వైద్యసేవలు అందిస్తున్నారు. తల్లి సరళతో ఉంటున్నకుమారుడు సుమన్ చక్రవర్తి యువ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తుంటే, అతని భార్య సంగీత ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తున్నారు. ఎనభై ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేళ అరుదైన ఈ కుటుంబ కధా చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉండే స్పర్ధలను దాటి, సదా సజీవంగా మిగిలే వొక అరుదైన చారిత్రిక జ్ఞాపకం అవుతుంది.
జాన్ సన్ చోరగుడి
(రచయిత: అభివృద్ది-సామాజిక అంశాల వ్యాఖ్యాత)










