రాజకీయాల్లో ఒక మాట కొన్ని గంటలు మాత్రమే బతుకుతుంది. కానీ కొన్ని పదాలు తరాల మనస్తత్వాన్ని మార్చేస్తాయి. చరిత్రలో ఎన్నోసార్లు అవమానంగా విసిరిన పదాలే, ఉద్యమాలకు గుర్తులయ్యాయి. ఇప్పుడు దేశ రాజకీయాల్లో అదే చర్చకు కారణమైన పదం “కాక్రోచ్”. అది ఒక వ్యంగ్యమా? వెటకారమా? లేక ఒక తరం మీద ముద్ర వేయాలన్న ప్రయత్నమా? అన్న ప్రశ్నల చుట్టూనే ఇప్పుడు పెద్ద చర్చ సాగుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… అవమానించాలనే ఉద్దేశంతో విసిరిన పదాన్నే కొందరు యువకులు తమ గుర్తింపుగా స్వీకరిస్తున్నారు. ఇదే నేటి జెన్-జీ రాజకీయ భాష. ఒకప్పుడు తక్కువ చేసి పిలిచిన పేర్లనే ఉద్యమాల జెండాలుగా మార్చిన చరిత్ర ప్రపంచంలో ఎన్నోసార్లు కనిపించింది. ఇప్పుడు భారత రాజకీయాల్లో కూడా అదే దృశ్యం ఆవిష్కృతమవుతోందా? ఒక పదం కేవలం విమర్శగా మిగిలిపోతుందా? లేక రేపటి రాజకీయ ప్రతిస్పందనకు ప్రతీకగా మారుతుందా? ఈ ప్రశ్నలకే సమాధానం వెతికే ప్రయత్నమే ఈ విశ్లేషణ.
1. తిట్టు, వెటకారం వేర్వేరు అనే తేడా తెలియక వచ్చిన తిప్పలు ఇవి. ఆయన జడ్జి కావడంతో, తిట్టు కంటే రెండోది బెటర్ అని అనుకుని ఉండొచ్చు.
2. కానీ, ఇప్పుడు అదొక ‘మేక్ ఇన్ ఇండియా’ అధిక్షేపం సెటైర్ (అధిక్షేపం) అయి కూర్చుంది. అది ఎక్కడైనా వ్యక్తీకరణకు స్వేచ్ఛ లేనప్పుడు, అధిక్షేపం ఆఖరి ఆయుధం అవుతుంది!
3. ఎవరిని అయితే నీచమని ఆ పేరుతో పిలిచారో, దాన్ని అందిపుచ్చుకుని తిరిగి అదే పేరు వాళ్ళు పెట్టుకోవడం జెన్ జీ ఇచ్చిన సరికొత్త ‘రిటార్ట్’ !!
4. భారత్ చుట్టూ దేశాల్లో గత ఏడాది కాలంలో పెల్లుబికిన జెన్ జీ ఉద్యమకారులకు భిన్నంగా ఒక్క ఇండియాలోనే వాళ్లకు- ‘కాక్రోచెస్ ‘ అనే జెనెరిక్ నామవాచకం… ఇది వర్ణ వ్యవస్థ కనుక అంత బాగా అమిరింది!
5. చూడండి, సీతాకోకచిలుక నుంచి బొద్దింక వరకు… అని కనుక మనం అనుకుంటే; మన భావన అలా… అలా.. షిఫ్ట్ అయ్యి వో పూదోట మీది నుంచి క్షణాల్లో రోడ్డు పక్కన చెత్తకుండీ వద్దకు అది చేరుతుంది! సూర్యకాంతిని తప్పించుకుని మరీ చీకట్లలో సంచరించడం ‘కాక్రోచెస్’ కు ప్రకృతి అప్పగించిన పని.
6. మనం ‘ జెన్ జీ ‘ అంటున్న ఈ దేశ నిరుద్యోగ యువత పరాన్నజీవులు ‘కాక్రోచెస్’ అని 80 ఏళ్ల మన దేశం దాని చరిత్రను ఒకే ఒక్క పదంతో రాసుకుంది.
7. మరది మంచికో చెడుకో తెలియదు కానీ, వందేళ్లకు ముందే వెతుక్కుని మరీ సూర్యకాంతి ఈ దేశం అండర్ గ్రౌండ్ డ్రైనేజీలోకి ప్రవేశించింది.
8. అది, అక్కడ మురికిలో మునిగి పనిచేసే ‘కాక్రోచ్’ లను తాకడంతో… బయటకు వచ్చి దేశమంతా అవి పాకుతున్నాయి.
9. శాస్త్రం ప్రకారం సంఘజీవులైన కాక్రోచెస్ కు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఎక్కువట! ఇక్కడ ప్రశ్న ఒక్కటే .10. రేపు ఇవే ‘కాక్రోచ్’ లు ఏ 20 ఏళ్ళ తర్వాతో…ఏదో ఒక మైక్ ముందు నిలబడి -” ….అనే నేను, అంతఃకరణ శుద్ధితో… “అనాల్సి వచ్చినప్పుడు, ఆ హాల్లోని లైట్ల వెలుగులో పోడియం మీద ఉన్న పదవీ ప్రమాణ స్వీకార పత్రం మీద కదులుతున్న బొద్దింక జ్ఞాపకం, క్షణమైనా గుర్తు వస్తుందా….?! వస్తే కనుక ఇది విజయమే!

జాన్ సన్ చోరగుడి
24 జులై 2026
విజయవాడ











