Home AP ఫార్చూన్ జాబితాలో నారా బ్రాహ్మణి.. అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవం

ఫార్చూన్ జాబితాలో నారా బ్రాహ్మణి.. అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవం

51


హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణికి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. ప్రముఖ వ్యాపార పత్రిక ఫార్చ్యూన్ ఇండియా ప్రకటించిన ‘మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్–2026’ జాబితాలో ఆమె చోటు దక్కించుకున్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి విశేషంగా తోడ్పడుతున్న మహిళా పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా ఆమెను గుర్తించారు. ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సదస్సులో నారా బ్రాహ్మణికి ఈ పురస్కారాన్ని అందజేశారు.

రైతులకే అంకితం

ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ హెరిటేజ్ ఫుడ్స్ విజయానికి రైతులే ప్రధాన బలం అని అన్నారు. పాల ఉత్పత్తి రంగంలో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు రైతుల జీవనోపాధిని మరింత మెరుగుపరచడమే తమ లక్ష్యమని వివరించారు. తనకు లభించిన ఈ గౌరవాన్ని హెరిటేజ్ ఫుడ్స్ కుటుంబానికి, రైతులకు, సంస్థ ఉద్యోగులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.

చంద్రబాబు, లోకేశ్ అభినందనలు

నారా బ్రాహ్మణి సాధించిన ఈ ఘనతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు ఆమె నాయకత్వం, దూరదృష్టి, అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు. యువతకు, ముఖ్యంగా తెలుగు యువతులకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేశ్ కూడా ఆమెను అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో స్థానం సంపాదించడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని అన్నారు.