ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ యువత కీలక భాగస్వాములు కావాలని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం ఏర్పాటు చేసిన ఐబీఎం కన్సల్టింగ్ ఫ్యూచర్‌నౌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏఐ, డిజిటల్ సేవలు, సాంకేతిక ఆవిష్కరణలకు విశాఖను దేశంలో అగ్రగామి కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఈ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. సాంకేతిక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం, నాణ్యమైన ఉద్యోగాలను సృష్టించడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను యువతకు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌పై ఐబీఎం కొనసాగిస్తున్న నమ్మకం రాష్ట్ర ఐటీ రంగానికి కొత్త ఊపునిస్తుందని, విశాఖను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని లోకేశ్ స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా కన్సల్టింగ్ సేవలు, ఏఐ ఆధారిత ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టులకు మద్దతు అందించేందుకు ఐబీఎం ఈ ఫ్యూచర్‌నౌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రం ద్వారా కృత్రిమ మేధస్సు, హైబ్రిడ్ క్లౌడ్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఎంటర్ప్రైజ్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి అత్యాధునిక రంగాల్లో సేవలు అందించనున్నారు. అలాగే ఏఐ ఆధారిత క్లౌడ్ ట్రాన్స్ఫర్మేషన్, ప్లాట్ఫార్మ్ ఇంజినీరింగ్, సర్వీస్ ఇంటిగ్రేషన్, క్వాలిటీ ఇంజినీరింగ్, యూజర్ ఎక్స్పీరియన్స్ సేవలకు ఈ కేంద్రం ప్రధాన హబ్‌గా పనిచేయనుంది. ప్రపంచ స్థాయి సాంకేతిక ప్రాజెక్టుల్లో ఏపీ యువతకు అవకాశాలు కల్పిస్తూ, విశాఖను డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక నగరంగా నిలబెట్టే దిశగా ఈ సెంటర్ మరో ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
#IBM #FutureNowCenter #Visakhapatnam #AndhraPradesh #NaraLokesh #DigitalEconomy #ArtificialIntelligence #ITSector #CyberSecurity #HybridCloud #Technology #DigitalTransformation











