గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కీలక ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందిన గూడపాటి శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రముఖ కాపు నాయకుడిగా పేరున్న గూడపాటి తన అనుచరులు, అభిమానులతో కలిసి తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్నారు. ఆయన చేరికతో రేపల్లె రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. స్థానికంగా బలమైన నాయకుడిగా ఉన్న గూడపాటి పార్టీ మారడం టీడీపీకి రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ చేరికకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.
రేపల్లెలో పార్టీ మరింత బలోపేతం: జగన్
గూడపాటి శ్రీనివాసరావుతో పాటు చేరిన ప్రతి కార్యకర్తకు వైఎస్ జగన్ స్వాగతం పలికారు. గూడపాటి తనకు అన్నలాంటి వ్యక్తి అని పేర్కొంటూ, ఆయనను గుండెల్లో పెట్టుకుని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. రేపల్లె నియోజకవర్గంలో పార్టీ ఇన్‌ఛార్జి పీటా నాగమోహనకృష్ణకు పూర్తి సహకారం అందించి వచ్చే ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గూడపాటి రాకతో ముఖ్యంగా రేపల్లె పట్టణంలో వైఎస్సార్‌సీపీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పీటా నాగమోహనకృష్ణతో పాటు పలువురు పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గూడపాటి చేరికతో రేపల్లెలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
#GudapatiSrinivasaRao #YSJagan #YSJaganMohanReddy #YSRCP #TDP #Repalle #RepallePolitics #AndhraPradeshPolitics #TDPLeader #TDPtoYSRCP #YSRCPNews #APPolitics #PoliticalDevelopments #RepalleElections











