Home General మోదీ ఇంటి ముట్టడి.. రాహుల్ అరెస్ట్, ముక్కుకు గాయం!

మోదీ ఇంటి ముట్టడి.. రాహుల్ అరెస్ట్, ముక్కుకు గాయం!

Rahul Gandhi Detained

106

రాహుల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

పేపర్ లీక్ పోరు.. ఢిల్లీలో ఉద్రిక్త దృశ్యాలు

విద్యార్థుల కోసం కాంగ్రెస్ నిరసన

పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ మంగళవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసం వైపు భారీ నిరసన చేపట్టింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ర్యాలీగా ముందుకు సాగారు. నిరసనకు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నేత సుప్రియా సూలే కూడా మద్దతు తెలిపారు. ప్రధానమంత్రి నివాసం సమీపంలో రాహుల్ గాంధీ రోడ్డుపైనే కూర్చొని ధర్నా చేపట్టారు. అక్కడి నుంచి వెళ్లేందుకు నిరాకరించడంతో పోలీసులు ఆయనను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రాహుల్ ముక్కుకు గాయమై రక్తస్రావం జరిగిన దృశ్యాలు వెలుగులోకి రావడంతో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ప్రియాంక గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు అక్కడి నుంచి తరలించారు. నిరసన స్థలానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేరుకుని రాహుల్ గాంధీతో కొంతసేపు చర్చలు జరిపారు. అయితే అవి ఎలాంటి ఫలితానికీ దారితీయలేదని కాంగ్రెస్ నేతలు తెలిపారు. పార్లమెంట్‌లో పేపర్ లీక్ అంశంపై పూర్తి స్థాయి చర్చ జరపడంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న తమ డిమాండ్లపై ప్రభుత్వం హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. అందువల్ల నిరసనను కొనసాగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

ప్రభుత్వం వాదన ఇదే.. పార్లమెంట్‌లోనూ ప్రతిష్టంభన

అయితే జితేంద్ర సింగ్ మాత్రం వేరే వాదన వినిపించారు. మొదట పార్లమెంట్‌లో చర్చకు మాత్రమే రాహుల్ గాంధీ అంగీకరించారని, తర్వాత విద్యాశాఖ మంత్రి రాజీనామా అనే కొత్త డిమాండ్‌ను జోడించారని ఆరోపించారు. ప్రభుత్వం అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉందని, కానీ షరతులు మారుస్తూ నిరసన కొనసాగించడం సరైంది కాదని ఆయన వ్యాఖ్యానించారు.

నిన్నటి ఘటనలే నేటి ఆందోళనకు కారణం

సోమవారం జరిగిన విద్యార్థుల నిరసనపై పోలీసుల లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం తీవ్ర విమర్శలకు గురైంది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడగా, వారిపై జరిగిన చర్యలకు బాధ్యత వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ కోరారు. మరోవైపు ఢిల్లీ పోలీసులు మాత్రం నిరసనకారులే హింసకు పాల్పడ్డారని, 118 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని తెలిపారు. పేపర్ లీక్, విద్యార్థులపై పోలీసుల చర్యల అంశాలను పార్లమెంట్‌లో చర్చించాలని కాంగ్రెస్ ప్రయత్నించినప్పటికీ అవకాశం ఇవ్వలేదని ప్రతిపక్షం ఆరోపించింది. తమ గొంతును అణిచివేస్తున్నారని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ మాత్రం నీట్ పేపర్ లీక్ వంటి ఘటనలను అరికట్టడం దేశ బాధ్యత అని పేర్కొంటూ, నిందితులపై ప్రభుత్వం ఇప్పటికే కఠిన చర్యలు ప్రారంభించిందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు మరింత ఉధృతమైంది.