Home National_news అయోధ్య రామాలయానికి సీఈఓ

అయోధ్య రామాలయానికి సీఈఓ

14


సీఈఓ నియామకానికి ప్రకటన
మూడేళ్ల పదవీకాలానికి దరఖాస్తు

అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. రామాలయ పరిపాలన, నిర్వహణ బాధ్యతలు చేపట్టే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.. సీఈఓ నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించింది. ట్రస్ట్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా అర్హతలు, నిబంధనలను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థి ఆలయ పరిపాలనను సమర్థంగా నిర్వహించే పూర్తి బాధ్యతను చేపట్టనున్నారు.

నాయకత్వమే ప్రధాన అర్హత

సీఈఓ పదవికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. పరిపాలన లేదా ఆర్థిక నిర్వహణ రంగంలో కనీసం 20 ఏళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలని ట్రస్ట్ స్పష్టం చేసింది. చురుకుగా హిందూ ధర్మాన్ని ఆచరించే వ్యక్తి కావాలని పేర్కొంది. వైష్ణవ సంప్రదాయానికి చెందిన శ్రీరామ భక్తుడు అయితే అదనపు అర్హతగా పరిగణిస్తామని వెల్లడించింది. విద్యార్హతలు, అనుభవంతో పాటు వ్యక్తిగత లక్షణాలపైనా ట్రస్ట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. నిజాయితీ, నిబద్ధత, పారదర్శకత, సమర్థ నాయకత్వ లక్షణాలు తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. ఆలయ సిబ్బంది నిర్వహణ, ట్రస్ట్ నిర్ణయాల అమలు, ధార్మిక కార్యక్రమాల సమన్వయం, భక్తులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవడం సీఈఓ ప్రధాన బాధ్యతలుగా ఉంటాయని వివరించింది.

విరాళాల వివాదం తర్వాత కీలక నిర్ణయం

ఎంపికైన అభ్యర్థి తొలి దశలో మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఈ కాలమంతా అయోధ్యలోనే నివసించడం తప్పనిసరి. దరఖాస్తుల గడువు జూలై 18గా నిర్ణయించారు. ట్రస్ట్ ఏర్పాటు చేసిన ప్రత్యేక శోధన కమిటీ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తుంది. గడువు ముగిసిన నెల రోజుల్లో ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని ట్రస్ట్ తెలిపింది. ఇటీవల రామాలయ విరాళాల దుర్వినియోగ ఆరోపణలు వెలుగులోకి రావడంతో సీఈఓ నియామకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆలయ పరిపాలన మరింత పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ట్రస్ట్ ముందుకు వచ్చినట్లు భావిస్తున్నారు. విశ్వ హిందూ పరిషత్ కూడా సీఈఓ నియామకాన్ని వ్యతిరేకించడం లేదని స్పష్టం చేసింది. అయితే ఈ ఎంపిక పూర్తిగా ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే జరగాలని పేర్కొంది. పదవిని తప్పనిసరిగా పదవీ విరమణ చేసిన అధికారికే ఇవ్వాలనే అభిప్రాయాన్ని కూడా విహెచ్‌పీ తిరస్కరించింది. ఎంపిక ప్రమాణాలు, తుది నిర్ణయం పూర్తిగా ట్రస్ట్ పరిధిలోనే ఉండాలని స్పష్టం చేసింది.