మహిళా అధికారికి పబ్లిక్ వార్కింగ్ .
తాడిపత్రి రాజకీయాల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి పేరు వినిపిస్తే వివాదం లేకుండా ఏ రోజు గడవడం కష్టమే అన్నట్టుగా పరిస్థితి తయారైందా? తాజాగా 22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారం మరోసారి ఆయనను వార్తల్లోకి తెచ్చింది. తాడిపత్రిలో సుమారు రూ.40 కోట్ల విలువైన 6.75 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారంటూ జేసీ ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరుతూ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ కార్యాలయం ఎదుట ఆయన ఆందోళనకు దిగారు. సబ్ రిజిస్ట్రార్ బసవరాజు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేశారని ఆరోపిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ భూ వ్యవహారంలో డిప్యూటీ తహసీల్దార్ సోమశేఖర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి, వీఆర్వో వెంకటస్వామి, జూనియర్ అసిస్టెంట్ మహ్మద్ షఫీని కలెక్టర్ సస్పెండ్ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. అంటే జేసీ లేవనెత్తిన అంశంలో కనీసం అధికారుల స్థాయిలో చర్యలు ప్రారంభమైన విషయం మాత్రం వాస్తవం.
మహిళా అధికారిణికి వేలు చూపిస్తూ వార్నింగ్
కానీ జరిగిన మరో పరిణామమే అసలు చర్చకు కారణమైంది. రిజిస్ట్రేషన్ డీఐజీ విజయలక్ష్మి ఎదుట జేసీ ప్రభాకర్‌రెడ్డి బహిరంగంగా వేలు చూపిస్తూ హెచ్చరించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అవి వైరల్ అయ్యాయి. మహిళా అధికారిణి అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా పబ్లిక్‌గా వార్నింగ్ ఇచ్చారంటూ ఈ ఘటనపై అనేకమైన వ్యాఖ్యలు కూడా వెలుగుచూశాయి. . ఒక ప్రజాప్రతినిధి లేదా రాజకీయ నాయకుడు అధికారుల అవినీతిని ప్రశ్నించడం తప్పు కాదు. అధికారులపై చర్యలు కోరడం కూడా తప్పు కాదు. కానీ ప్రశ్నించే హక్కు, హెచ్చరించే అధికారం ఒక్కటే కావు. ప్రభుత్వ యంత్రాంగంలో తప్పు జరిగిందని అనిపిస్తే దానికి ఫిర్యాదు ఉంది, విచారణ ఉంది, న్యాయస్థానం ఉంది. ఆధారాలు ఉంటే వాటిని సమర్పించే మార్గం ఉంది. కానీ అధికారిణి ఎదుటే వేలెత్తి బహిరంగ హెచ్చరికలు చేయడం రాజకీయ పోరాటానికి, అధికార వ్యవస్థపై వ్యక్తిగత ఒత్తిడికి మధ్య ఉన్న గీతను చెరిపేస్తుందనే విమర్శలకు తావిస్తుంది.
వైసీపీ నేతలపై జేసీ కబ్జా ఆరోపణలు
ఇక్కడ మరో కీలక అంశాన్ని కూడా విస్మరించకూడదు. జేసీ ప్రభాకర్‌రెడ్డి వైసీపీ నేతలపై భూకబ్జా ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా రెండు సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్నారని ఆరోపించారు. అంతేకాదు, తాడిపత్రి పరిసరాల్లో దాదాపు 190 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయని, తన వద్ద ఆధారాలు ఉన్నాయని జేసీ మరో సందర్భంలో చెప్పారు. ఇవన్నీ జేసీ చేసిన ఆరోపణలే.. కానీ తుది వాస్తవాలుగా నిర్ధారించబడినవి కావు. అదే సమయంలో తాజా 6.75 ఎకరాల వ్యవహారంలో కొందరు రెవెన్యూ అధికారులు సస్పెండ్ కావడం మాత్రం అధికారిక చర్య. కాబట్టి ఇప్పుడు అసలు తేలాల్సింది రాజకీయ ఆరోపణల పరస్పర పోరు కాదు.. ఆ భూమి ప్రభుత్వానిదా, 22-ఏ పరిధిలోకి ఎందుకు వచ్చింది, రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది, ఎవరి ఆదేశాలతో జరిగింది, నిబంధనలు ఉల్లంఘించారా లేదా అన్నదే.
మొదట్నుంచి వివాదాస్పదంగానే జేసీ శైలి
తాడిపత్రి రాజకీయాల్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహారశైలి ఎప్పుడూ దూకుడుగానే ఉంటుంది. అదే దూకుడు కొన్నిసార్లు అధికారులను కదిలించే రాజకీయ ఒత్తిడిగా కనిపించవచ్చు. మరికొన్నిసార్లు అధికారం చేతిలో లేకపోయినా అధికారం ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలకు కారణమవుతుంది. భూముల అక్రమ రిజిస్ట్రేషన్లను బయటపెట్టడం ప్రజా ప్రయోజనమే అయితే, దానికి సరైన మార్గం ఆధారాలతో విచారణ కోరడం. అధికారులను ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కే అయితే, వారిపై వ్యక్తిగతంగా ఒత్తిడి తీసుకురావడం మరో విషయం. డీఐజీ విజయలక్ష్మికి బహిరంగంగా హెచ్చరిక చేసిన ఘటన అందుకే తాడిపత్రి రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. జేసీ అడుగుతున్న ప్రశ్నలు నిజంగా భూముల గురించా? లేక ఆ ప్రశ్నలు అడిగే విధానమే ఇప్పుడు మరో వివాదంగా మారుతోందా? 22-ఏ భూముల వ్యవహారంలో నిజాలు విచారణతో బయటకు రావాలి. కానీ రాజకీయ నాయకుడు ఎంత దూకుడుగా ఉన్నా.. అధికార వ్యవస్థపై మాట్లాడే భాష, ప్రవర్తించే తీరు కూడా అంతే ముఖ్యమన్నది మాత్రం తాజా ఘటన మరోసారి గుర్తుచేసింది.
#JCPrabhakarReddy #Tadipatri #TadipatriPolitics #22ALands #GovernmentLand #LandRegistration #LandRow #RegistrationDepartment #Vijayalakshmi #APLandRow #RevenueOfficials #AndhraPradeshPolitics #APPolitics #LandControversy #TadipatriNews











