బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సెప్టెంబర్ 19 సాయంత్రానికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అనంతరం ఇది 3–4 రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. తర్వాత దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశముందని అంచనా వేసింది. దీని ప్రభావంతో వచ్చే వారంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అధికారులు సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
రేపటి నుంచి మరిన్ని ప్రాంతాలకు వర్షాలు
ప్రస్తుత ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమపై సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ద్రోణి విస్తరించింది. రేపు అల్లూరి, పోలవరం, కృష్ణా, గుంటూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే కాకినాడ రౌతులపూడిలో 68.6 మి.మీ., అనకాపల్లి మర్రిపాలెంలో 54 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈదురుగాలులతో వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందు వాతావరణ హెచ్చరికలను తప్పనిసరిగా గమనించాలని అధికారులు కోరారు.











