తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పెద్ద శుభవార్త చెప్పారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు కార్మికులకు జులై 1 నుంచి 11 శాతం ఫిట్‌మెంట్, వేతన సవరణ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. గురువారం టీజీఎస్‌ఆర్‌టీసీ ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. దీనితో పాటు సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ విడుదలకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు.
బస్ స్టేషన్ల ఆధునీకరణ
రాష్ట్రంలో రవాణా మౌలిక వసతుల మెరుగుదలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. నాగర్ కర్నూల్, పెద్దపల్లి బస్ డిపోల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వేములవాడ, కథలాపూర్ బస్ స్టేషన్ల నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. హుజూర్‌నగర్, కోదాడ, నాగర్‌కర్నూల్ కొత్త బస్ స్టేషన్ల నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ములుగు బస్ స్టేషన్ భవన నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు.
సేవలపై సమగ్ర నివేదిక
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం తీరుపై ప్రత్యేక అధ్యయనం చేయాలని మంత్రి సూచించారు. మహిళా సంఘాలకు చెందిన 553 అద్దె బస్సుల పనితీరుపై నివేదిక ఇవ్వాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణహిత రవాణా కోసం ప్రవేశపెట్టిన 1,050 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం సంస్థ పరిధిలో 10,173 బస్సులు, 38,128 మంది ఉద్యోగులు ఉన్నారని, ప్రతిరోజూ 61 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలు వాడుకుంటున్నారని వివరించారు.
ఉద్యోగుల సంక్షేమ చర్యలు
ఆర్టీసీలో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి పొన్నం అధికారులను ఆదేశించారు. గతంలో వివిధ కారణాలతో విధుల్లోంచి తొలగించిన ఉద్యోగుల్లో 244 మందికి మానవతా దృక్పథంతో మళ్లీ అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగి శంకర్ కుటుంబానికి రూ. 1 కోటి ప్రమాద బీమా చెక్కును అందజేయనున్నట్లు తెలిపారు. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేశామన్నారు. త్వరలోనే దక్షిణ భారత రవాణా శాఖ మంత్రులతో అంతర్రాష్ట్ర రవాణా అంశాలపై ప్రత్యేక సమావేశం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు











