Home AP మద్యం స్కాంలో కరుమూరికి రిమాండ్

మద్యం స్కాంలో కరుమూరికి రిమాండ్

సెప్టెంబర్ 7 వరకు జ్యుడీషియల్ కస్టడీ

మాజీ మంత్రి, ఎమ్మెల్యే కరుమూరి వెంకట నాగేశ్వరరావుకు రూ.195 కోట్ల ఏపీఎస్‌బీసీఎల్ మద్యం రవాణా కుంభకోణం కేసులో కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సెప్టెంబర్ 7 వరకు ఆయనను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని నాంపల్లి ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు సోమవారం ఆదేశించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆగస్టు 23న ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం కరుమూరిని అరెస్టు చేసింది. అనంతరం సోమవారం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఈ కేసులో కరుమూరి కీలక పాత్ర పోషించారని ఈడీ ఆరోపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ అదనపు కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు కావడం గమనార్హం.

టెండర్ల నుంచి నిధుల మళ్లింపు వరకు

మద్యం రవాణా కాంట్రాక్టుల కోసం రూపొందించిన టెండర్ నిబంధనలను కొన్ని సంస్థలకు అనుకూలంగా మార్చినట్లు ఈడీ ఆరోపించింది. సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అనంతరం ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్స్‌కు ప్రయోజనం కలిగేలా టెండర్లను రూపొందించారని దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఈ సంస్థలు ఫ్రంట్ కంపెనీలుగా పనిచేశాయని ఆరోపించింది. మార్కెట్ ధరల కంటే అధిక రేట్లకు రవాణా కాంట్రాక్టులు కేటాయించడం ద్వారా అక్రమ ఆదాయం వచ్చినట్లు ఈడీ తెలిపింది. కరుమూరి తన కుమారుడు సునీల్ కుమార్‌తో కలిసి రాజకీయ పలుకుబడిని ఉపయోగించి రవాణా సబ్‌కాంట్రాక్టుల కేటాయింపులో ప్రభావం చూపారని ఆరోపించింది. నకిలీ లేదా పెంచిన ఇన్వాయిస్‌ల ద్వారా నిధులను మళ్లించినట్లు ఈడీ పేర్కొంది. ఆ డబ్బులో కొంత కరుమూరి, ఆయన కుటుంబ సభ్యుల ఖాతాలకు చేరిందని, ఖరీదైన వాహనాలు, లగ్జరీ వాచ్‌లు కొనుగోలు చేయడం, స్థిరాస్తుల కోసం అడ్వాన్సులు చెల్లించడం, రాజకీయ కార్యకలాపాలు, వ్యక్తిగత ఖర్చులకు వినియోగించినట్లు దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది.

 

#Karumuri #KarumuriVenkataNageswaraRao #KarumuriLiquorScam #LiquorScam #APLiquorScam #APSBCL #LiquorTransportScam #EnforcementDirectorate #ED #PMLA #MoneyLaundering #JudicialCustody #KarumuriArrest #APCID #AndhraPradesh #AndhraPradeshPolitics #LiquorTransport #₹195CroreScam #PoliticalScam #APNews