తిరుమలలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది మరోసారి నిజాయతీ, అప్రమత్తతకు నిదర్శనంగా నిలిచారు. తమిళనాడుకు చెందిన భక్తుడు పి. కార్తికేయన్ కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్తూ అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద సుమారు రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు ఉన్న బ్యాగును పొరపాటున అక్కడే మర్చిపోయారు. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. విధుల్లో ఉన్న విజిలెన్స్ సిబ్బంది బ్యాగును గుర్తించి భద్రపరిచారు. బ్యాగులో రూ.10,900 నగదు, రెండు బంగారు గాజులు, ఒక బంగారు గొలుసు, రెండు బంగారు ఉంగరాలు ఉన్నట్లు టీటీడీ సెక్టార్-5 ఏవీఎస్వో రమేశ్ తెలిపారు. బ్యాగులో లభించిన వివరాల ఆధారంగా అధికారులు వెంటనే కార్తికేయన్‌ను ఫోన్లో సంప్రదించి సమాచారం అందించారు. దీంతో ఆయన అలిపిరి తనిఖీ కేంద్రానికి చేరుకున్నారు. బ్యాగులోని వస్తువుల వివరాలను అధికారులు అడగగా, కార్తికేయన్ చెప్పిన వివరాలు సరిగ్గా సరిపోవడంతో బ్యాగును అతనికి అప్పగించారు. విలువైన వస్తువులు సురక్షితంగా తిరిగి లభించడంతో భక్తుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బాధ్యతతో వ్యవహరించి తన బ్యాగును భద్రంగా తిరిగి అందించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు, సిబ్బందికి కార్తికేయన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
#TTD #TTDVigilance #Tirumala #Tirupati #Alipiri #TTDVigilanceStaff #ForgottenBag #LostAndFound #GoldJewellery #Devotee #TTDHonesty #TTDSecurity #GoldRecovered #LostValuables #TirumalaDevotee #AlipiriCheckPost #TirumalaNews #TirupatiNews #DevoteeRelief











