రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణలో తీవ్ర అవకతవకలు జరిగాయని వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఈ వ్యవహారంపై తక్షణమే సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత మంత్రిని పదవి నుంచి పక్కన పెట్టాలని కోరారు. డీఎస్సీ సమస్యపై యువత, నిరుద్యోగులు 70 రోజులకు పైగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. వెనక్కి వెళ్తామని చెప్పినా అనుమతులు ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలకు, చేతలకు పొంతన లేదని విమర్శించారు. సంపద సృష్టిస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల వైపు ఎందుకు నడిపిస్తోందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు
వైద్య రంగాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, పేదలకు ఉపయోగపడే ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేశారని బొత్స ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోకుండా అమరావతిపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని విమర్శించారు. రైతులకు పంటలకు తగిన మద్దతు ధర లభించడం లేదని అన్నారు. ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉందని బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు.
#BotsaSatyanarayana #APDSC #DSCRecruitment #DSCIrregularities #CBIProbe #AndhraPradeshPolitics #YSRCP #APGovernment #TeacherRecruitment #DSCProtest #UnemployedYouth #StudentsProtest #ChandrababuNaidu #EducationDepartmentAP #APTeacherJobs #APPoliticalNews











