త్యాగం కాదు.. భవిష్యత్ నిర్మాణానికి స్ఫూర్తి.
రైతుల త్యాగానికి చంద్రబాబు ప్రశంసలు.
అమరావతి నిర్మాణంలో రైతుల పాత్ర చరిత్రాత్మకమని సీఎం చంద్రబాబు అన్నారు. రైతులు ముందుకు రాకపోతే రాజధాని నిర్మాణం సాధ్యమయ్యేది కాదని స్పష్టం చేశారు. వారి త్యాగం కేవలం భూములు ఇవ్వడంతో ముగియలేదని, రాష్ట్ర భవిష్యత్‌కు స్ఫూర్తిగా నిలిచిందని కొనియాడారు. రాజధాని నిర్మాణంలో రైతులను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తీసుకొచ్చామని చంద్రబాబు తెలిపారు. నోటిఫికేషన్ ఇచ్చిన 58 రోజుల్లోనే 29 వేల మంది రైతులు సుమారు 33 వేల ఎకరాలు ఇచ్చేందుకు ముందుకొచ్చారని గుర్తుచేశారు. రైతుల నమ్మకానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు.
గ్రాఫిక్స్ అన్నవారికి నిర్మాణాలే సమాధానం
హైదరాబాద్‌లో సైబరాబాద్ నిర్మాణ సమయంలో ఎదురైన విమర్శలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లామని చంద్రబాబు చెప్పారు. అదే దృక్పథంతో అమరావతిని ఆధునిక మహానగరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. సింగపూర్ సహకారంతో మాస్టర్‌ప్లాన్ రూపొందించామని, ఆధునిక మౌలిక వసతులతో రాజధానిని నిర్మిస్తున్నామని వెల్లడించారు. గతంలో అమరావతి నిర్మాణాన్ని కొందరు గ్రాఫిక్స్ అంటూ ఎగతాళి చేశారని చంద్రబాబు విమర్శించారు. ఇప్పుడు జరుగుతున్న నిర్మాణాలను వచ్చి చూడాలని అన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు రాజధానికి కీలక అనుసంధానంగా నిలుస్తుందని చెప్పారు. స్టీల్ బ్రిడ్జీల ప్రారంభంతో అమరావతి నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడిందన్నారు.
రైతులే అమరావతి చరిత్ర
అమరావతిని ఆపడం ఇక ఎవరి వల్లా కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. భూగర్భ విద్యుత్ లైన్లు, గ్యాస్ వ్యవస్థలు, ఆధునిక రహదారులతో నగరాన్ని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఇవాళ ప్రారంభించిన పనులు చిన్న ట్రైలర్ మాత్రమేనని, అమరావతి నిర్మాణం రాష్ట్ర అభివృద్ధి విజన్‌కు తొలి విజయమని పేర్కొన్నారు. రాజధాని ఉద్యమంలో రైతుల పాత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందని సీఎం అన్నారు. అమరావతి నిర్మాణం రాష్ట్ర భవిష్యత్‌కు ప్రతీకగా మారుతుందని చెప్పారు. రాజధానితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.
#Amaravati #AmaravatiFarmers #ChandrababuNaidu #AmaravatiCapital #LandPooling #AmaravatiDevelopment #AndhraPradesh #APCapital #CapitalDevelopment #AmaravatiInfrastructure #SeedAccessRoad #APPolitics #AmaravatiNews #AndhraPradeshDevelopment











