Home AP తాగునీటికి మొదటి ప్రాధాన్యత

తాగునీటికి మొదటి ప్రాధాన్యత


వాటర్ మూవ్‌మెంట్ ప్లాన్‌తో నీటి నిర్వహణ.
జలవనరుల శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు.

రాష్ట్రంలో నీటి నిర్వహణను వాటర్ మూవ్‌మెంట్ ప్లాన్ ప్రకారమే చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం లోటు వర్షపాతం పరిస్థితులు ఉన్నందున పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. రిజర్వాయర్లు, చెరువుల్లో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించడంతో పాటు భూగర్భ జలాల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన జలవనరుల శాఖ సమీక్షలో పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల పనుల పురోగతిని సీఎం పరిశీలించారు. 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేసేందుకు నెలవారీ లక్ష్యాలు నిర్దేశించుకోవాలని అధికారులకు సూచించారు.

పోలవరం పనులు వేగవంతం

పోలవరం ప్రాజెక్టులో ఇప్పటివరకు 89.9 శాతం సివిల్ పనులు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. ఎడమ కాలువ పనులను వేగంగా పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి విశాఖ వరకు ఎడమ కాలువలో మిగిలిన పనులు పూర్తిచేయాలని స్పష్టం చేశారు. అనకాపల్లి వరకు ఉన్న నీటి వనరులు, రిజర్వాయర్లు, చెరువులను ఈలోగా నీటితో నింపాలని సూచించారు. పోలవరం పరిసరాలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. వెలిగొండ పనులు పూర్తి చేయడంతో పాటు నిర్వాసితుల సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని చెప్పారు.

డేటా సెంటర్లపై ప్రచారం చేయాలి

డేటా సెంటర్లకు నీటి వినియోగంపై జరుగుతున్న విమర్శలకు సీఎం స్పందించారు. డేటా సెంటర్లకు మొత్తంగా 3.5 టీఎంసీల నీరే అవసరమని ప్రజలకు వివరించాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి తర్వాత పారిశ్రామిక అవసరాలకు నీరు అందేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ సీజన్‌లో ఆరు తడి పంటలు సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. జలధార, జలహారతి కార్యక్రమాలను కొనసాగిస్తూ భూగర్భ జలాలను పెంచాలని ఆదేశించారు. గోదావరి నీటిని ఉత్తరాంధ్ర, కృష్ణా డెల్టా ప్రాంతాలకు అవసరమైన మేరకు వినియోగించే అవకాశాలను పరిశీలించాలని, అన్నమయ్య ప్రాజెక్టు దిగువ ఆయకట్టుకు నీరందించే అంశంపై అధ్యయనం చేయాలని సీఎం సూచించారు.

 

#ChandrababuNaidu #DrinkingWater #WaterMovementPlan #AndhraPradesh #WaterManagement #Polavaram #Veligonda #WaterResources #Groundwater #IrrigationProjects #APDevelopment #WaterConservation