జనసేన శ్రేణులకు పవన్ హెచ్చరిక.
సోషల్ మీడియా గైడ్లైన్స్ తప్పనిసరి.
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్టీ నేతలు, కార్యకర్తలు, మహిళా విభాగం నాయకులకు కీలక సూచనలు చేశారు. సోషల్ మీడియా, బహిరంగ వేదికలపై అభిప్రాయాలు వ్యక్తం చేసేటప్పుడు భాషలో హద్దులు దాటొద్దని స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జారీ చేసిన మార్గదర్శకాల్లో అనవసర, సంబంధం లేని అంశాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించారు. వ్యక్తిగత విమర్శలు, దూషణలు, అసభ్య పదజాలానికి దూరంగా ఉండాలని సూచించారు. మహిళల గురించి మాట్లాడేటప్పుడు గౌరవం, మర్యాద తప్పనిసరిగా పాటించాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా స్పందన
రాజకీయ అంశాలపై స్పందించే సమయంలో భావోద్వేగాలకు లోనుకావద్దని, పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు అనుగుణంగానే వ్యాఖ్యలు చేయాలని పవన్ సూచించారు. అంతర్గత పార్టీ వ్యవహారాలపై సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ప్రకటనలు చేయవద్దని హెచ్చరించారు. పార్టీ సిద్ధాంతాలను కించపరిచే వ్యాఖ్యలను సహించబోమని నాయకత్వం స్పష్టం చేసింది. కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు, క్రమశిక్షణకు భంగం కలిగించే ప్రకటనలకు దూరంగా ఉండాలని సూచించింది.
కూటమి ఐక్యతకు ప్రాధాన్యం
జనసేనలో గందరగోళం సృష్టించేందుకు రాజకీయ ప్రత్యర్థులు సోషల్ మీడియా ప్రచారాలు నిర్వహించే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. అలాంటి ప్రచారాలకు కార్యకర్తలు బలికావద్దని సూచించారు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ స్ఫూర్తి, ఐక్యత దెబ్బతినకుండా ప్రతి నేత వ్యవహరించాలని కోరారు. సోషల్ మీడియా వినియోగంలో క్రమశిక్షణ, సంస్థ గౌరవం, బాధ్యతాయుత వైఖరి పాటించాలని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది.
#PawanKalyan #JanaSena #JanaSenaParty #SocialMediaGuidelines #JanaSenaCadre #AndhraPradeshPolitics #NDAGovernment #PoliticalDiscipline #SocialMedia #PawanKalyanWarning #NDAAlliance #APPolitics











