40 లక్షల పాస్‌బుక్కులు పంపిణీ.
మీ భూమి–మీ హక్కులో సీఎం చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు భూమిపై భద్రమైన హక్కులు కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 40.58 లక్షల పట్టాదారు పాస్‌బుక్కులు పంపిణీ చేశామని, మరో 51 లక్షల పాస్‌బుక్కులను నెలవారీ లక్ష్యాలతో అందజేస్తామని వెల్లడించారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని నర్సింగోలు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో ఎనిమిది గ్రామాలకు చెందిన 1,301 మంది రైతులకు పాస్‌బుక్కులు అందించారు. రాష్ట్ర చిహ్నంతో పాటు అదనపు భద్రతా ప్రమాణాలు కలిగిన పాస్‌బుక్కులను జారీ చేస్తున్నామని చెప్పారు. అక్టోబర్‌లోనే 790 గ్రామాల్లో నాలుగు లక్షలకు పైగా పాస్‌బుక్కులు పంపిణీ చేసినట్లు వివరించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ ఆక్రమణలు, అక్రమాలు, వివాదాలు పెరిగాయని చంద్రబాబు ఆరోపించారు.
భూ వివాదాల పరిష్కారానికి చర్యలు
ల్యాండ్ టైట్లింగ్ చట్టంతో భూముల యాజమాన్యంపై అనిశ్చితి ఏర్పడిందని చంద్రబాబు విమర్శించారు. తమ ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసిందని, 22-ఏ నిషేధిత జాబితా నుంచి 16.48 లక్షల ఎకరాలను తొలగించామని తెలిపారు. కంగుండి, అమలాపురం, శెట్టిపల్లి ప్రాంతాల్లో సుమారు 41 వేల ఎకరాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించినట్లు చెప్పారు. ఉమ్మడి ప్రకాశం, రాయలసీమ జిల్లాలను అంతర్జాతీయ స్థాయి ఉద్యానవన కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామీణ మౌలిక వసతుల కోసం రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ, విశాఖపట్నం, మంగళగిరి ప్రాంతాల్లో 60 వేల మందికి గృహ హక్కులు కల్పించామని, రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేశామని, మరో ఆరు లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు రూ.31 వేల కోట్లతో కార్యక్రమం ప్రారంభించామన్నారు.
రెండేళ్లలో పాలేరు రిజర్వాయర్ పూర్తి
ప్రకాశం జిల్లాలో సాగునీరు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు పోతుల చెంచయ్య–పాలేరు రిజర్వాయర్‌ను రూ.166.40 కోట్లతో రెండేళ్లలో పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రాజెక్టుతో 9,500 ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు 15 గ్రామాల్లో 35 వేల మందికి తాగునీటి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. పొన్నలూరు మండలంలో వేమూరుపాడు రహదారి నిర్మాణానికి, పాలేరు నదిపై వంతెనకు కలిపి రూ.28 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు నీరు తీసుకొచ్చామని, రెండో దశను కూడా పూర్తి చేసి అన్ని ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. యువతకు ఉపాధి కల్పించేలా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నామని సీఎం వివరించారు.
#ChandrababuNaidu #MeeBhoomiMeeHakku #PattadarPassbooks #AndhraPradesh #FarmerLandRights #APFarmers #LandRecords #PrakasamDistrict #Kondapi #LandDisputes #VelugondaProject #IrrigationProjects #FarmerWelfare #APGovernment











