యుడైస్ లెక్కలతో కూటమిపై జగన్ ఆగ్రహం .
ప్రభుత్వ బడుల్లో చేరికలు తగ్గాయన్న నివేదిక .
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖకు చెందిన యుడైస్ ప్లస్ 2025–26 గణాంకాలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వం చెబుతున్న విద్యార్థుల చేరికల వాదనను ప్రశ్నించారు. 2023–24లో ప్రభుత్వ పాఠశాలల్లో 40,50,116 మంది విద్యార్థులు ఉండగా.. 2025–26లో ఆ సంఖ్య 34,93,450కి పడిపోయిందని జగన్ పేర్కొన్నారు. అంటే 5,56,666 మంది విద్యార్థులు తగ్గిపోయారని తెలిపారు. ఇదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45 వేల నుంచి 44,222కి, ఎయిడెడ్ పాఠశాలలు 991 నుంచి 797కి తగ్గాయని వివరించారు.
ప్రైవేట్ విద్య వైపు పెరిగిన విద్యార్థులు
ప్రభుత్వం మాత్రం ప్రైవేట్ పాఠశాలల నుంచి 1.10 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ బడులకు మారారని చెబుతోందని జగన్ గుర్తుచేశారు. అది నిజమైతే ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరగాలి కదా? అని ఆయన ప్రశ్నించారు. అదే కాలంలో ప్రైవేట్ యాజమాన్యంలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45,53,380 నుంచి 48,40,296కి పెరిగిందని తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గడం, ప్రైవేట్ పాఠశాలల్లో పెరగడం ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ఆందోళన కలిగించే పరిణామమని పేర్కొన్నారు. నారాయణ, శ్రీచైతన్య, భాష్యం, విజ్ఞాన్, గీతమ్ వంటి సంస్థల ఆధిపత్యం ఉన్న ప్రైవేట్ విద్యారంగానికి కూటమి ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోందని జగన్ ఆరోపించారు.
నాడు–నేడు గుర్తుచేసిన జగన్
తమ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2019–24 మధ్య ప్రభుత్వ విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టామని జగన్ తెలిపారు. మన బడి–నాడు నేడు ద్వారా 56,703 ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచామని చెప్పారు. విద్యార్థులకు ట్యాబ్‌లు, బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు, డిజిటల్ తరగతులు, ఐఎఫ్‌పీలు, స్మార్ట్ టీవీలు అందించామని వివరించారు. మూడో తరగతి నుంచే టోఫెల్ ఆధారిత ఇంగ్లిష్ బోధనకు చర్యలు తీసుకున్నామని, అంతర్జాతీయ స్థాయి విద్య కోసం ఐబీ విధానంపై పనిచేశామని గుర్తుచేశారు. ప్రతి వర్గానికీ నాణ్యమైన విద్య అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని జగన్ పేర్కొన్నారు.
#APGovernmentSchools #AndhraPradesh #YSJagan #UDISEPlus #UDISE2025 #GovernmentSchools #SchoolAdmissions #APEducation #EducationInAP #NaduNedu #ManabadiNaduNedu #PrivateSchools #APPolitics #JaganMohanReddy #EducationReforms











