Home AP దమ్ముంటే రా.. డీఎస్సీపై తేల్చుకుందాం!

దమ్ముంటే రా.. డీఎస్సీపై తేల్చుకుందాం!

లోకేశ్‌ సవాల్‌ను స్వీకరించే దమ్ము ఉందా?
వైసీపీ అధినేత జగన్‌కు బోండా ఉమా సవాల్‌.

మెగా డీఎస్సీపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు బహిరంగ సవాల్‌ విసిరారు. మంత్రి నారా లోకేశ్‌ విసిరిన సవాల్‌ను స్వీకరించే దమ్ము జగన్‌కు ఉందా? మెగా డీఎస్సీపై బహిరంగ చర్చకు మేం సిద్ధం.. ప్లేస్‌, టైమ్‌, డేట్‌ నువ్వే నిర్ణయించుకో అంటూ సవాల్‌ చేశారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ మెగా డీఎస్సీపై వైసీపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీతో 16,400 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నా.. దాన్ని వైసీపీ తట్టుకోలేక తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. నిరుద్యోగులను పట్టించుకోని జగన్‌ ఇప్పుడు మెగా డీఎస్సీపై నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో ఒక్కసారైనా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేశారా? ఒక్క డీఎస్సీ అయినా నిర్వహించారా? అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజే చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారని గుర్తుచేశారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం వైసీపీకి తగదని అన్నారు.

పోస్టులు అమ్ముకున్నారంటూ ఆరోపణలు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయని బోండా ఉమా ఆరోపించారు. ఆర్డీవో పోస్టులకు రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు, డీఎస్పీ పోస్టులకు రూ.60 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేశారని ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీలో అవకతవకలు జరిగాయని హైకోర్టు వ్యాఖ్యానించిందని పేర్కొన్నారు. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలాగా పెట్టిన ఘనత గత ప్రభుత్వానిదేనని విమర్శించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా ముందుకు వెళ్తుంటే వైసీపీ రాజకీయ లబ్ధి కోసం డీఎస్సీపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. “దమ్ముంటే రా జగన్‌.. చర్చకు సిద్ధమా?” అంటూ మరోసారి సవాల్‌ విసిరారు. కష్టపడి చదివి డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను కూడా జైలుకు పంపాలనుకుంటున్నారా అని జగన్‌ను ప్రశ్నించారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి తగిన సమాధానం చెబుతారని బోండా ఉమా హెచ్చరించారు

 

#BondaUma #MegaDSC #MegaDSC2025 #DSCRecruitment #APDSC #JaganMohanReddy #YSJagan #NaraLokesh #BondaUmaChallenge #MegaDSCDebate #TeacherJobs #APTeacherJobs #UnemployedYouth #TDP #YSRCP #ChandrababuNaidu #APPolitics #AndhraPradeshPolitics #DSCControversy #APNews