Home AP రెసిడెన్షియల్ విద్యకు ఏఐ బూస్ట్

రెసిడెన్షియల్ విద్యకు ఏఐ బూస్ట్

ప్రతిభా కేంద్రాలుగా ఏపీఆర్‌ స్కూళ్లు.
అంతర్జాతీయ ప్రమాణాలే లక్ష్యమన్న లోకేశ్.

ఏపీ రెసిడెన్షియల్‌ స్కూళ్లను ప్రతిభావంతులను తీర్చిదిద్దే కేంద్రాలుగా మార్చాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలో జరిగిన ఏపీఆర్ఈఐఎస్ 59వ గవర్నింగ్‌ బాడీ సమావేశంలో అకడమిక్‌ ఎక్సలెన్స్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అంతర్జాతీయ ప్రమాణాలు తీసుకురావాలని సూచించారు. రెసిడెన్షియల్‌ విద్యార్థులకు కంప్యూటర్‌ ల్యాబ్స్‌, ఏఐ స్కిల్లింగ్‌ తప్పనిసరి చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు ఏపీఆర్‌ విద్యాసంస్థల నుంచి 27 మంది ఐఏఎస్‌లు, 20 మంది ఐపీఎస్‌లు, 13 మంది ఐఆర్‌ఎస్‌లు, నలుగురు ఐఎఫ్‌ఎస్‌లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

పది సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లు

రాష్ట్రవ్యాప్తంగా 10 ఏపీ రెసిడెన్షియల్‌ స్కూళ్లను సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లుగా అభివృద్ధి చేసేందుకు బోర్డు ఆమోదించింది. నిమ్మకూరు ఏపీఆర్‌ జూనియర్‌ కళాశాలలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఐఐటీ–జేఈఈ/నీట్‌ అకాడమీ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మరో ఆరు రెసిడెన్షియల్‌ స్కూళ్లను జూనియర్‌ కళాశాలలుగా అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. భూపతిపాలెంలో ప్రపంచస్థాయి స్పోర్ట్స్‌ ఎకోసిస్టమ్‌ ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని లోకేశ్‌ సూచించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వృత్తివిద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలని చెప్పారు.

స్మార్ట్‌ కిచెన్లు.. డిజిటల్‌ సర్టిఫికెట్లు

ఏపీఆర్‌ సంస్థల సిబ్బంది పదవీవిరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. అన్ని విద్యాసంస్థల్లో ఆటోమేటెడ్‌ స్మార్ట్‌ కిచెన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని లోకేశ్‌ ఆదేశించారు. ఇంటర్‌ పరీక్షల నిర్వహణ, మూల్యాంకన సిబ్బంది భత్యాన్ని 25 శాతం వరకు పెంచేందుకు ఇంటర్మీడియట్‌ బోర్డు ఆమోదించింది. మూల్యాంకనంలో తీవ్రమైన తప్పిదాలకు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. 1978 నుంచి జారీ చేసిన ఇంటర్‌ సర్టిఫికెట్లన్నింటినీ డిజిటలైజ్‌ చేసి బ్లాక్‌చైన్‌ టెక్నాలజీతో అనుసంధానించాలని తీర్మానించింది. మౌలిక వసతులతో పాటు విద్యా ఫలితాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని లోకేశ్‌ స్పష్టం చేశారు.

#APResidentialSchools #NaraLokesh #APREIS #AndhraPradeshEducation #AIinEducation #AITraining #CentresOfExcellence #ResidentialEducation #Nimmakuru #IITJEE #NEET #SmartSchools #DigitalCertificates #BlockchainTechnology #EducationNews