స్థానిక ఎన్నికలే లక్ష్యం.. టీడీపీ శ్రేణులకు బీటెక్ రవి దిశానిర్దేశం
అక్టోబర్ ఎన్నికలపై ఫోకస్.. క్యాడర్‌కు కీలక సూచనలు
45 రోజుల కార్యాచరణ అమలు చేయాలి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానం ప్రకటించిన 45 రోజుల కార్యాచరణ ప్రణాళికను గ్రామ స్థాయి వరకు సమర్థంగా అమలు చేయాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’, పెంచిన పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని నాయకులకు ఆదేశించారు.
కార్యకర్తలే పార్టీ బలం
పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు తాను రుణపడి ఉన్నానని బీటెక్ రవి అన్నారు. పదవుల విషయంలో అసంతృప్తి సహజమే అయినప్పటికీ కష్టపడిన వారికే తగిన గుర్తింపు లభిస్తుందని స్పష్టం చేశారు. బూత్ లెవల్ ఏజెంట్లు సమర్థంగా పనిచేసి నియోజకవర్గంలో దాదాపు 30 వేల తప్పుడు ఓట్లను గుర్తించడం అభినందనీయమని కొనియాడారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి నాయకుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పులివెందుల మున్సిపాలిటీపై గురి
రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ నాలుగు వారాల పాటు పులివెందులలో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. అక్టోబర్‌లో జరిగే స్థానిక ఎన్నికల్లో పులివెందుల మున్సిపాలిటీని గెలిపించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, కౌన్సిలర్ వంటి పదవుల్లో పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలకు అవకాశాలు కల్పించే బాధ్యత తనదేనని హామీ ఇస్తూ ప్రతి ఒక్కరూ ఎన్నికల విజయానికి కష్టపడాలని పిలుపునిచ్చారు.











