స్పోర్ట్స్ కోటాలో నిబంధనల ప్రకారమే అడుగులు.
మెగా డీఎస్సీ-2025 నియామకాలపై సోషల్ మీడియా, మీడియాలో వస్తున్న ఆరోపణలను ఏపీ ప్రభుత్వం ఖండించింది. అమరావతిలో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ తమీమ్ అన్సారియా, ఎస్‌ఏఏపీ ఎండీ భరణి మీడియాతో మాట్లాడారు. స్పోర్ట్స్ కోటా నియామకాలు కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే జరిగాయని భరణి స్పష్టం చేశారు. తుది జాబితాకు ముందు 1:5 నిష్పత్తిలో అభ్యర్థుల వివరాలను ఆగస్టు 8 నుంచి 14 వరకు బహిరంగపరిచి అభ్యంతరాలు స్వీకరించామని తెలిపారు. ఆ సమయంలో జూడో సర్టిఫికెట్లపై ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. 2013 ఖమ్మం సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూడో టోర్నమెంట్ సర్టిఫికెట్లపై ప్రస్తుతం ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. సంబంధిత జూడో సంఘం వాటిని ధ్రువీకరించిన తర్వాతే నియామక ప్రక్రియ కొనసాగించామని చెప్పారు. పాత రికార్డులు హైదరాబాద్‌లో ఉండటం, విభజన తర్వాత ఎస్‌ఏఏపీ కార్యాలయం అమరావతికి తరలిరావడంతో 2013 నాటి ప్రతి రికార్డును స్వయంగా పరిశీలించడం సాధ్యం కాదని వివరించారు. పిల్ నంబర్ 170లో హైకోర్టు ఆదేశాల మేరకు జూడో సంఘం, సర్టిఫికెట్లపై మూడు నెలల విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.
టెట్ అర్హతపై క్లారిటీ
టెట్ అర్హతలపై వచ్చిన ఆరోపణలను స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ తమీమ్ అన్సారియా వివరించారు. కర్నూలుకు చెందిన బీసీ అభ్యర్థి ప్రభాకర్ 77 మార్కులతో టెట్ అర్హత సాధించారని తెలిపారు. ఈ అంశంపై మరింత స్పష్టత కోసం సెప్టెంబర్ 5న ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జంపాల ఉష 2012లో 80 మార్కులతో టెట్ ఉత్తీర్ణులయ్యారని, ఆ సమయంలో లాంగ్వేజ్ పండిట్లకు ప్రత్యేక టెట్ లేకపోవడంతో ఆమె సర్టిఫికెట్ చెల్లుబాటు అవుతుందని వివరించారు. ఇతర అభ్యర్థుల అర్హతలు కూడా నిబంధనల ప్రకారమే ఉన్నాయని తెలిపారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల పరిశీలన రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్నందున అనుమానాలు వచ్చిన సర్టిఫికెట్లను జిల్లా కలెక్టర్లకు పంపామని చెప్పారు. జూడో సర్టిఫికెట్ల వ్యవహారంపై ప్రభుత్వం హైకోర్టు తుది ఆదేశాలకు కట్టుబడి ఉంటుందని భరణి స్పష్టం చేశారు. కుప్పంలో టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయుడిపై దాడి ఘటనపై సుమోటో కేసు నమోదు చేసినట్లు కమిషనర్ తెలిపారు. మీడియా పేరుతో టీచర్లను బెదిరించడం, బ్లాక్‌మెయిల్ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, నిరాధార ఆరోపణలు చేయకుండా ఆధారాలున్న వారు విద్యాభవన్ గ్రీవెన్స్ సెల్‌కు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం సూచించింది.
#MegaDSC2025 #APDSC #DSC2025 #TeacherRecruitment #APTeacherJobs #SportsQuota #SportsQuotaJobs #JudoCertificates #DSCControversy #APTET #TETEligibility #TETQualification #TameemAnsariya #SAAP #Bharani #APEducation #APSchoolEducation #APHighCourt #VigilanceInquiry #AndhraPradesh #APNews











