చీరాల ఘటనపై సుమోటో విచారణ
చీరాల రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ సందర్భంగా వృద్ధ ఎస్టీ ఎరుకుల మహిళ పట్ల పోలీసు అధికారి అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ సుమోటోగా స్పందించింది. సెప్టెంబర్ 6న రామనగర్‌లో జరిగిన కార్డన్ సెర్చ్ సమయంలో చీరాల రెండో పట్టణ సీఐ వృద్ధ గిరిజన మహిళతో అభ్యంతరకరమైన భాషలో మాట్లాడినట్లు వచ్చిన ఆరోపణలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమైనట్లు కమిషన్ పేర్కొంది. ఈ మేరకు సెప్టెంబర్ 7న కమిషన్ కార్యదర్శి పేరిట లేఖ నం.3634/JA/Chairman-Sumoto/2026 జారీ చేసి బాపట్ల జిల్లా ఎస్పీకి లేఖ రాసింది.
పోలీసుల తీరుపైనా పాత ఆరోపణలు
వృద్ధ మహిళ ఘటనతో పాటు చీరాల పోలీస్ డివిజన్‌లో కొంతమంది పోలీసు అధికారుల పనితీరుపై గతంలోనూ అసంతృప్తి వ్యక్తమైన విషయాన్ని కమిషన్ ప్రస్తావించింది. ప్రజలు, కార్యకర్తలు, జర్నలిస్టుల పట్ల కొంతమంది అధికారులు సక్రమంగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలను కూడా పరిశీలించాలని సూచించింది. అక్రమ ఇసుక తవ్వకాలు, సహజ వనరుల దోపిడీని ప్రశ్నించే వ్యక్తులపై ఒత్తిళ్లు, బెదిరింపులు, క్రిమినల్ కేసులు పెడుతున్నారన్న ఆరోపణలు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న వారితో కొంతమంది పోలీసు అధికారులు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలపైనా విచారణ చేయాలని ఆదేశించింది. వృద్ధ ఎస్టీ మహిళ పట్ల పోలీసుల ప్రవర్తనపై నిష్పాక్షిక విచారణ జరిపి, ఆరోపణలు నిజమైతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కమిషన్ స్పష్టం చేసింది. విచారణ అనంతరం పూర్తి వాస్తవ నివేదికను సమర్పించాలని బాపట్ల ఎస్పీని కోరింది. రాష్ట్ర స్థాయి ఎస్టీ కమిషన్ నేరుగా జోక్యం చేసుకోవడం చీరాలలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.












