Home General మోదీ సర్కార్‌పై సోనియా ఘాటు విమర్శలు

మోదీ సర్కార్‌పై సోనియా ఘాటు విమర్శలు

విద్యార్థులు శత్రువులా?..
నేడు, రేపు వాళ్లే దేశ భవిష్యత్ .


దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులను దేశ భవిష్యత్తుగా చూడాల్సింది పోయి, దేశ శత్రువుల్లా చూస్తోందని మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యార్థులు బాధ్యత కోరుతున్నారని, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతున్నారని, కానీ ప్రభుత్వం వారికి సమాధానం చెప్పకుండా బలప్రయోగానికి దిగిందని ఆరోపించారు. ఈ మేరకు ఆమె ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందూలో వ్యాసం రాశారు.

జూలై 20 ఘటన మర్చిపోలేం

జూలై 20న ఢిల్లీలో జరిగిన ఘటనలను దేశం ఎప్పటికీ మర్చిపోదని సోనియా గాంధీ అన్నారు. లాఠీచార్జ్, టియర్ గ్యాస్, పెల్లెట్ గాయాలతో విద్యార్థులు రక్తసిక్తమైన దృశ్యాలు దేశ మనస్సాక్షిని కదిలించాయని పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మంచివి కావని విమర్శించారు. “ఆపండి… వీళ్లు మన కుమారులు, కుమార్తెలు” అంటూ ప్రభుత్వం వెంటనే తన వైఖరి మార్చుకోవాలని పిలుపునిచ్చారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వ విద్యను కేంద్రం బలహీనపరిచిందని సోనియా గాంధీ ఆరోపించారు. పాఠశాల విద్యపై కేంద్ర బడ్జెట్ కేటాయింపులను భారీగా తగ్గించిందని, ఉన్నత విద్యకూ నిధులు కుదించిందని అన్నారు. దాదాపు లక్ష ప్రభుత్వ పాఠశాలలు మూతపడగా, వేలాది ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. దీంతో నాణ్యమైన విద్య కోసం కుటుంబాలపై ఆర్థిక భారం పెరిగిందని విమర్శించారు.

ప్రధాన్‌పై నేరుగా విమర్శలు

విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన బాధ్యతను విస్మరించారని సోనియా గాంధీ ఆరోపించారు. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) బలోపేతానికి పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన సూచనలను కూడా పట్టించుకోలేదని అన్నారు. వరుసగా వెలుగుచూసిన ప్రశ్నాపత్రాల లీకేజీల తర్వాత కూడా ఆయన రాజీనామా చేయకపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని మరింత పెంచిందని వ్యాఖ్యానించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడటం ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి ప్రభుత్వ రాజ్యాంగబద్ధ బాధ్యత అని సోనియా గాంధీ స్పష్టం చేశారు. ప్రశ్నించే ప్రతి గొంతును దేశద్రోహంగా ముద్ర వేయడం సమస్యలకు పరిష్కారం కాదని చెప్పారు. ప్రజల ఆవేదనను వినడం, తప్పులను సరిదిద్దడం, విద్యా వ్యవస్థపై విశ్వాసాన్ని పునరుద్ధరించడమే ప్రభుత్వ ముందున్న అసలు పరీక్ష అని ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల ఉద్యమం కేవలం పేపర్ లీకేజీల గురించి మాత్రమే కాదని, దేశ విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న పోరాటమని ఆమె అభిప్రాయపడ్డారు.

 

#SoniaGandhi #StudentProtests #NEETPaperLeak #ModiGovernment #DharmendraPradhan #EducationSystem #NTA #Congress #IndianPolitics #Students #YouthVoice #EducationCrisis