Home AP రాష్ట్రంలో ఓటర్లు 3.71 కోట్లు ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

రాష్ట్రంలో ఓటర్లు 3.71 కోట్లు ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల


అభ్యంతరాలకు ఆగస్టు 30 వరకు ఛాన్స్
అక్టోబర్ 3న తుది జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 3,71,38,182 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వెల్లడించారు. వీరిలో 1,82,06,954 మంది పురుషులు, 1,89,28,492 మంది మహిళలు, 2,736 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. అదనంగా 64,502 మంది సర్వీస్ ఓటర్లు కూడా నమోదయ్యారు. ఎస్‌ఐఆర్‌కు ముందు రాష్ట్రంలో 4.16 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా, ధృవీకరణ ప్రక్రియ అనంతరం ఈ ముసాయిదా జాబితా సిద్ధమైంది.

ఆగస్టు 30 వరకు అవకాశం

జూన్ 15 నుంచి జూలై 24 మధ్య ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించలేకపోయిన వారు జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాల సమయంలో ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. విదేశాల్లో ఉన్న భారతీయులు ఫారం-6ఏ, పేరు తొలగింపు లేదా అభ్యంతరాలకు ఫారం-7, చిరునామా మార్పు, వివరాల సవరణ, వికలాంగుల గుర్తింపు వంటి మార్పులకు ఫారం-8 ఉపయోగించాలని ఎన్నికల సంఘం సూచించింది. ముసాయిదా జాబితాను ఈఆర్‌వో, ఏఈఆర్‌వో కార్యాలయాలు, బీఎల్‌వోల వద్దతో పాటు సీఈఓ వెబ్‌సైట్, ఈసీఐనెట్ యాప్‌లో పరిశీలించవచ్చని తెలిపింది. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 3న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం గైర్హాజరు, మరణించిన, చిరునామా మార్చుకున్న, డూప్లికేట్ ఓటర్లు కలిపి 44.89 లక్షల నమోదులను గుర్తించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

 

#APVoterList #APDraftVoterList #AndhraPradesh #SIR #SpecialIntensiveRevision #VoterList2026 #APElectoralRoll #ElectionCommission #APPolitics #VoterRegistration #VoterListObjections #VoterClaims #Form6 #Form7 #Form8 #AndhraPradeshElections #FinalVoterList