ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్, పొగాకు రంగాలకు విధానపరమైన, ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, అంతర్జాతీయ మార్కెట్‌లో తీవ్రమవుతున్న పోటీ కారణంగా రైతులు, ఎగుమతిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు.
ఆక్వా రైతులకు ప్రత్యేక సాయం కోరిన సీఎం
ఆక్వాకల్చర్ రంగానికి ఉపయోగించే ఏరేటర్లపై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని చంద్రబాబు కోరారు. ఆక్వా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు పథకం కింద ఒకేసారి అదనంగా రూ.5 లక్షల రుణ పరిమితి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దేశీయ మార్కెటింగ్‌ను బలోపేతం చేసేందుకు నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో రూ.100 కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని కూడా సూచించారు.
పొగాకు రంగానికి ఊతం ఇవ్వాలన్న విజ్ఞప్తి
తయారీ చేయని పొగాకుపై ప్రస్తుతం అమలులో ఉన్న 40 శాతం జీఎస్‌టిని 28 శాతానికి తగ్గించాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ నిర్ణయం వల్ల రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులకు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో భారత పొగాకు పోటీతత్వం మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌కు రాసిన లేఖలో చేపల దాణా తయారీలో ఉపయోగించే ఫిష్ మీల్ ఎగుమతులను నియంత్రించాలని చంద్రబాబు కోరారు. అధిక ఎగుమతుల కారణంగా దేశీయంగా ధరలు పెరుగుతున్నాయని వివరించారు. ఎఫ్‌సీవీ పొగాకు ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు తయారీ చేయని పొగాకును
ఆర్వోడీటీఈపీ ఎగుమతి చేసిన ఉత్పత్తులపై చెల్లించిన సుంకాలు, పన్నుల తిరిగి చెల్లింపు పథకం చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
అమరావతిలో ఎన్‌ఎఫ్‌డీబీ ప్రాంతీయ కార్యాలయం
రొయ్యల దాణాలో ప్రధాన ముడిసరుకైన జన్యుమార్పిడి సోయాబీన్ మీల్ దిగుమతులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మత్స్యశాఖ మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. దేశీయంగా కొరత ఏర్పడటం వల్ల దాణా వ్యయం పెరుగుతోందని తెలిపారు. 2021లో ఇలాంటి దిగుమతులకు కేంద్రం అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈక్వెడార్ నుంచి రొయ్యల ఎగుమతులు పెరగడంతో అమెరికా, చైనా, యూరప్ మార్కెట్లలో పోటీ మరింత తీవ్రమైందని వివరించారు. అమరావతిలో నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని కూడా చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యాలయం కోసం గుంటూరు జిల్లా నెక్కల్లు గ్రామంలో 7.89 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. అదే ప్రాంతంలో మత్స్య శిక్షణ కేంద్రం, ఫిషరీస్ పార్క్, పబ్లిక్ అక్వేరియం ఏర్పాటుకు కూడా భూమి సిద్ధంగా ఉందని వెల్లడించారు. కేంద్రం సహకరిస్తే ఆక్వా రంగం, పొగాకు రంగం బలోపేతమై రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
#ChandrababuNaidu #AndhraPradesh #AquaFarmers #TobaccoFarmers #AquaSector #GSTReduction #NationalFisheriesDevelopmentBoard #NirmalaSitharaman #PiyushGoyal #RajivRanjanSingh #Aquaculture #FishExports #AgricultureNews #APNews #BreakingNews











