Home Inter National News టెర్రర్ కేపిటల్ – తాను సృష్టించిన భూతం చేతిలో ఖతమవుతున్న పాక్

టెర్రర్ కేపిటల్ – తాను సృష్టించిన భూతం చేతిలో ఖతమవుతున్న పాక్

3

ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ పాకిస్తాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. పాకిస్తాన్‌ను ఒక “ఫ్రాంకెన్‌స్టైన్ దేశం”… సొంతంగా సృష్టించిన భూతం చేతిలోనే నాశనమయ్యే దేశమని భారత్ అభివర్ణించింది. ఉగ్రవాదులను పోషిస్తూ, శిక్షణ ఇస్తూ, వారిని ప్రయోగిస్తోందని ఇస్లామాబాద్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ వార్షిక నివేదికపై జరిగిన చర్చలో పాకిస్తాన్, ఓఐసీ… ఇస్లామిక్ సహకార సంస్థ, జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తాయి. దీనికి సమాధానంగా భారత దౌత్యవేత్త అనుపమ సింగ్ గట్టిగా బదులిచ్చారు.

కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌దే
పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ పూర్తిగా తిరస్కరించింది. జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని అనుపమ సింగ్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని తేల్చిచెప్పారు. పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగాలను తిరిగి అప్పగించడమే ఇప్పుడు మిగిలి ఉన్న ఏకైక అంశమని ఆమె అన్నారు. అక్రమ ఆక్రమణలను కేవలం బలప్రయోగంతోనే కొనసాగించగలరని విమర్శించారు.

ఉగ్రవాదానికి సొంత రక్షణ మంత్రి మద్దతు
ఉగ్రవాదులను పెంచి పోషించడమే తమ దేశ విధానమని పాకిస్తాన్ రక్షణ మంత్రే స్వయంగా గొప్పలు చెప్పుకుంటారని అనుపమ సింగ్ గుర్తుచేశారు. అలాంటి దేశం మళ్లీ తనను తాను ఉగ్రవాద బాధితురాలిగా చెప్పుకోవడం పెద్ద విడ్డూరమని ఎద్దేవా చేశారు. తాను పెంచిన ఉగ్రవాద భూతమే ఇప్పుడు తనను తిరిగి కబలిస్తుంటే పాకిస్తాన్ ఆశ్చర్యపోతోందని అన్నారు. అక్కడ కనీస స్వేచ్ఛ లేకపోవడం వల్ల ప్రజలు ఆహారం, విద్యుత్, హక్కుల కోసం పోరాడుతుంటే బుల్లెట్లతో అణచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పాతబడిన సింధు నదీ జలాల ఒప్పందం
సింధు నదీ జలాల ఒప్పందం ఇప్పుడు పూర్తిగా పాతబడిపోయిందని భారత్ ప్రకటించింది. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే దేశం, స్నేహపూర్వక సహకారాన్ని ఆశించడం తగదని పేర్కొంది. 2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. 1960లో జరిగిన ఈ ఒప్పందాన్ని ప్రస్తుత పరిస్థితులకు తగినట్లు మార్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

సొంత ఇల్లు చక్కబెట్టుకోవాలి
పాకిస్తాన్ ఇతరుల భూభాగాలపై ఆశపడటం మానేయాలని భారత్ హితవు పలికింది. వేరే దేశాల విషయాల్లో జోక్యం చేసుకునే బదులు, తమ సొంత ఇంటిని చక్కబెట్టుకుంటే ఆ దేశ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అనుపమ సింగ్ సూచించారు. ఇప్పటికైనా పాకిస్తాన్ ఉగ్రవాదానికి స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు.

 

#IndiaVsPakistan #UnitedNations #UNHRC #AnupamaSingh #Pakistan #JammuAndKashmir #Kashmir #India #Terrorism #CrossBorderTerrorism #PakistanTerrorism #UNDebate #InternationalNews #WorldNews #Diplomacy #IndianDiplomacy #OIC #HumanRightsCouncil #PoK #PakistanOccupiedKashmir #IndusWatersTreaty #PahalgamAttack #Geopolitics #GlobalPolitics #BreakingNews #IndiaNews #PakistanNews #UNSpeech #ForeignAffairs #InternationalRelations