ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఐదుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని నియమించారు. పార్టీ శ్రేణుల నుంచి క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించే 14 మంది సభ్యుల సమన్వయ కమిటీతో ఈ బృందం నిరంతరం సమన్వయం చేసుకోనుంది. సేకరించిన సమాచారాన్ని పరిశీలించి పార్టీ అధ్యక్షుడికి ఎప్పటికప్పుడు నివేదించనుంది. ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, భీమవరం నియోజకవర్గానికి చెందిన పులపర్తి ప్రశాంత్, రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన యనమల భాస్కర్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే పనిచేస్తున్న 14 మంది సభ్యుల స్థానిక ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీతో కలిసి కొత్త కమిటీ పనిచేయనుంది. క్షేత్రస్థాయి పరిస్థితులు, పార్టీ శ్రేణుల నుంచి వచ్చే సమాచారాన్ని సేకరించి అధ్యయనం చేసి పవన్ కళ్యాణ్కు నివేదిక అందించనుంది. ఆ నివేదికల ఆధారంగా పార్టీ అధ్యక్షుడు కమిటీ సభ్యులతో ప్రతిరోజూ సమీక్ష నిర్వహించి, ఎన్నికల వ్యూహంపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే సమయంలో గతంలో ఏర్పాటు చేసిన 14 మంది సభ్యుల కమిటీలో కొన్ని మార్పులు చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఎన్నికల సన్నాహక ప్రక్రియను మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లేలా ఈ చర్యలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.











