Home Crime_News జైల్లోనే అబూ సలేం విడుదలకు సుప్రీం నో

జైల్లోనే అబూ సలేం విడుదలకు సుప్రీం నో

25 ఏళ్ల లెక్కపై కోర్టు షాక్.

1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషి అబూ సలేం విడుదల కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 25 ఏళ్ల జైలు శిక్ష పూర్తయిందన్న కారణంతో వెంటనే విడుదల చేయాలన్న అతడి వాదనను కోర్టు తిరస్కరించింది. డాన్‌ దావూద్‌ ఇబ్రహీం గ్యాంగ్‌లో కీలక సభ్యుడిగా ఉన్న సలేం 2005లో పోర్చుగల్‌ నుంచి భారత్‌కు అప్పగించబడ్డాడు. అప్పట్లో భారత్‌ ప్రభుత్వం పోర్చుగల్‌కు ఇచ్చిన హామీ ప్రకారం అతడికి మరణశిక్ష విధించబోమని, 25 ఏళ్లకు మించి జైలులో ఉంచబోమని స్పష్టం చేసింది. ముంబై పేలుళ్ల కేసులో 2017లో సలేంకు జీవిత ఖైదు విధించారు. 1995లో వ్యాపారవేత్త ప్రదీప్‌ జైన్‌ హత్య కేసులోనూ 2015లో జీవిత ఖైదు పడింది. 2022లో సుప్రీంకోర్టు ఈ కేసుల్లో విధించిన జీవిత ఖైదును 25 ఏళ్ల గరిష్ఠ పరిమితికి లోబడి ఉండేలా నిర్ణయించింది.

జైలు కాలాన్ని ముందుకు లెక్కించలేం

జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన ధర్మాసనం బాంబే హైకోర్టు తీర్పును సమర్థించింది. పోర్చుగల్‌లో 2002 సెప్టెంబర్‌ 18న నిర్బంధించినప్పటి నుంచి 25 ఏళ్ల కాలాన్ని లెక్కించాలని సలేం తరఫు న్యాయవాది వాదించారు. అండర్‌ట్రయల్‌గా గడిపిన కాలం, జైలులో పొందిన రిమిషన్‌ను కూడా కలిపితే తాను 26 ఏళ్ల 9 నెలలకుపైగా శిక్ష అనుభవించినట్లు సలేం వాదించాడు. అయితే ఒకే కాలాన్ని రెండు కేసుల్లో వేర్వేరుగా లెక్కించడం ద్వారా రెట్టింపు ప్రయోజనం పొందాలని ప్రయత్నించారని కోర్టు స్పష్టం చేసింది. 25 ఏళ్ల పరిమితి అంటే జీవిత ఖైదు 25 ఏళ్ల శిక్షగా మారిపోయిందని అర్థం కాదని ధర్మాసనం తేల్చిచెప్పింది.

నేరాల తీవ్రతను విస్మరించలేం

ముంబై పేలుళ్లలో 257 మంది ప్రాణాలు కోల్పోగా, 700 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో గుజరాత్‌ నుంచి ముంబైకి పేలుళ్ల కోసం ఆయుధాలు తరలించినట్లు సలేం దోషిగా తేలాడు. దేశ ఆర్థిక రాజధాని ముంబైపై జరిగిన దాడులు వ్యక్తిగత బాధితులకు మాత్రమే సంబంధించిన నేరాలు కావని, దేశాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో జరిగిన చర్యలని సుప్రీంకోర్టు పేర్కొంది. జాతీయ, ఆర్థిక పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండా విడుదలను కోరలేరని స్పష్టం చేసింది. సలేం జీవిత ఖైదు కొనసాగుతుందని, 25 ఏళ్ల పరిమితి మాత్రం పోర్చుగల్‌కు భారత్‌ ఇచ్చిన సార్వభౌమ హామీ కారణంగా ఏర్పడిందని కోర్టు వివరించింది. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం అతడి విడుదల తేదీ 2046 జనవరి 31గా ఉన్నట్లు ధర్మాసనం పేర్కొంది.

 

#AbuSalem #AbuSalemRelease #AbuSalemCase #SupremeCourt #SupremeCourtVerdict #AbuSalemJail #25YearJailTerm #LifeImprisonment #MumbaiBlasts #1993MumbaiBlasts #MumbaiSerialBlasts #PortugalExtradition #IndiaPortugal #DawoodIbrahim #PradeepJainMurder #CriminalCase #SupremeCourtIndia #AbuSalemLatest #MumbaiBlastsCase #IndiaNews #CourtVerdict #BreakingNews