ఆమె తొలగింపు ‘అకడమిక్’ చర్చ ఎందుకయింది?

why-has-konda-surekha-removal-become-an-academic-debate

ఉత్తర భారతానికి దక్షణ భారతానికి వింధ్య పర్వత శ్రేణి అడ్డు ఉన్న కారణంగా ఏమో, డిల్లీలో ఉండే కాంగ్రెస్ పార్టీ హెడ్ ఆఫీస్ తరుచూ సౌత్ ఇండియా రాష్ట్రాలతో ‘సిగ్నల్స్’ సమస్య ఫీలవుతున్నట్టుగా ఉంటుంది. అయితే అది చేసిన తప్పులకు నాలుక కరుచుకునే లోపు, ఆ పార్టీకి ఇక్కడ ఇక్కడ జరగాల్సిన ‘డ్యామేజి’ పూర్తి అవుతుంది. ఏదైనా పై నుంచి క్రిందికి రావడం ‘ఫిజిక్స్’ సూత్రం అయినప్పుడు, వింధ్యకు అవతల 2000 నాటికే మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడితే, పద్నాలుగు ఏళ్ళ తర్వాత, అప్పటికే ఆ పార్టీ ఇక్కడ ఎంతో పోగొట్టుకున్న తర్వాత గానీ… వింధ్యకు ఇవతల అది ‘తెలంగాణ’ను ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీలో ‘మూడ్ ఆఫ్ ది స్టేట్’ డిల్లీకి బట్వాడా వేగం- ‘గుర్రాలపై భటులు ఉత్తరాల’ కాలం నాటిది. కాకుంటే, తెలంగాణ ఇచ్చి కూడా రెండు వరస వోటముల తర్వాత, టిడిపి రేవంత్ రెడ్డి ఏఐసీసీ ‘ఎరినా’లోకి తన టోపీ విసిరి, ఏకంగా కాంగ్రెస్ సిఎం ఎలా అవుతాడు. అతడు టిడిపిలో నాయుడు ‘లిబరలైజేషన్ పాలిటిక్స్ స్కూల్’ నుంచి వచ్చిన విషయం తెలియనిది ఎవరు.

ఎనభైల్లో ఇదే సీన్ ‘రివర్స్’ కావడం ఇప్పుడు కాంగ్రెస్ కు గుర్తు ఉందో లేదో? అప్పట్లో కాంగ్రెస్ లో ఉంటూ చంద్రబాబు నాయుడు టీడీపీలోకి ఇలాగే తన ‘టోపీ’ విసిరి, ఆ పార్టీకి అధినేతై చివరికి కాంగ్రెస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేశాడు. అదే పనిని రేవంత్‌తో చేయిస్తే, అతడు వర్ధమాన వర్గాలపై (‘ఎమర్జింగ్ కమ్యూనిటీస్’) అదే బాబు తరహా ఆధిపత్య రాజకీయాలు చేస్తున్నాడు. అయితే ఎక్కువ సార్లు మనం వ్యక్తులు చుట్టూ ఒక పరిధి గీసి చూస్తాము మాట్లాడతాము గానీ; అక్కడ ఉండే ఇతర ‘ఫ్యాక్టర్స్’ గురించిన స్పృహ లేక వాటిని పెద్దగా పట్టించుకోకుండా వదిలేస్తాము. ఇప్పుడైనా తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక బీసీ మహిళా మంత్రి కొండా సురేఖ బర్తరఫ్ కావడంతో, దాన్ని చూడాల్సింది ఎలా అనేది, ఒక ‘అకడమిక్’ అంశం అయిపోయింది.

తన ‘రీ మ్యాపింగ్ ఇండియా: న్యూ స్టేట్స్ అండ్ ఇట్స్ పొలిటికల్ ఆరిజన్’ గ్రంధంలో రచయిత్రి లూయిస్ టిల్లిన్ లేవనెత్తిన పలు అంశాలు ఈ భర్తరఫ్ సందర్భంగా అన్వయానికి అర్హమైనవిగా కనిపిస్తున్నాయి. ఇప్పడు ఇది ఎంత కీలకం అయింది అంటే, రాష్ట్ర విభజన రేఖను దాటి మరీ తెలుగునాట సామాజిక రాజకీయాల పరిణామాలు, వాటి మూలాలను వెతకాల్సిన తప్పనిసరి పరిస్థితిని ముందుకు తెచ్చింది. మామూలుగా ఇటువంటివి చూసి, ఇవి ఏదో జిల్లా లేదా నియోజకవర్గం ‘పాలిటిక్స్’ అనుకుని అక్కడ మనం ఆగిపోతాం. కానీ, పైకి కనిపించకుండా మన కాళ్ళ క్రింద జరిగే ‘టెక్టానిక్ ప్లేట్స్’ కదలికల్ని పసిగట్టే స్పృహ, దాన్ని తట్టి లేపే ‘సోషల్ మెకానిజం’ మనకు తక్కువ. రాష్ట్రంగా తెలంగాణ రావడానికి ముందు, వింధ్య పర్వత శ్రేణి అవతల ఏర్పడిన మూడు కొత్త రాష్ట్రాలలో జరిగింది ఏమిటో స్థూలంగా మనకు అర్ధమైతే, ఆలస్యంగా అయినా ఇక్కడ జరుగుతున్నది తెలిసే అవకాశం ఉంది. వింధ్యకు అవతల మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లో 70-80 దశకాల మధ్య శుక్లాలకు, సింగ్ లకు (బ్రాహ్మణ-క్షత్రియ) మధ్య సాగిన ఆధిపత్య పోరుకు, వారి గ్రూప్ రాజకీయాలకు కూడా ‘స్టేట్’ (రాజ్యం) ‘జాగ్రఫీ’ ప్రాతిపదికగా రాష్ట్రాల పునర్నిర్మాణంతోనే ఒక శాశ్విత పరిష్కారం దొరికింది. అలా ‘మదర్ స్టేట్’ మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్ఘర్ వేరైతే, మునుపటి దాని రాజకీయ పోరు స్థానిక రూపం తీసుకుని అది సూక్ష్మస్థాయికి చేరింది.

‘రాజ్యం’ (‘స్టేట్’) కొత్త ప్రాంతాలకు, ప్రజలకు చేరువ అవుతుంటే జరిగేది అదే. ‘శుక్లా’ల మీద ‘సింగ్’ లు గెలిచాక, సెంట్రల్ ఇండియా నుంచి అర్జున్ సింగ్ కేంద్ర కేబినెట్ లో కీలకమైన ‘లీడర్’ అయితే, దిగ్విజయ సింగ్ 1993 నుంచి 2003 మధ్య పదేళ్ళపాటు రాష్ట్రంలో సిఎంగా ఉన్నారు. ఇక్కడ గమనిస్తే, ‘సోషల్ ఆర్డర్’ అలాగే ఉంది మార్పు లేదు. చరిత్ర రచనలో ‘టైమ్ అండ్ ప్లేస్’ ఎందుకు కీలకమో మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడిన పాతికేళ్ళ తర్వాత, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము. అయితే, అక్కడ ‘సింగ్’లు అనుసరించిన వ్యూహం ఏమిటి? ‘గ్రూపు’ రాజకీయాలు. ప్రాంతాల వారీగా నమ్మకమైన పార్టీ నాయకులతో జట్టు కట్టి వారిని తమతో చేరదీసి, తమ ఆధిపత్యాన్ని వారు వ్యక్తిగత బలంగా మార్చుకున్నారు. ఏపీలో 2000 తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ గా డా. వైఎస్సార్ చేసింది కూడా అదే! అయితే, ఇక్కడ తేడా ఏమంటే, ఉమ్మడి ఏపీలో ఆయన అనుచరులు- ‘నానాజాతి సమితి’. ఢిల్లీ ఏఐసీసీకి ఉన్న ‘వేవ్ లెంగ్త్’ సమస్య ఎటువంటిది అంటే, 2000 నాటి సెంట్రల్ ఇండియా పరిణామాలు తర్వాత ఏపీలో మారాల్సిన ‘రెడ్డి’ ఫ్యాక్టర్ ఎటువంటిదో కూడా దానికి అర్ధం కాలేదు. అందుకే డా. వై. ఎస్. రాజశేఖర రెడ్డిని ఏఐసీసీ తన పాత కాంగ్రెస్ రెడ్ల ఖాతాలోనే జతకట్టి అతడు ‘మరో రెడ్డి’ అనుకుని సరిపెట్టుకుంది. కానీ, అలా కాదని దానికి విషయం అర్ధమయ్యేసరికి తెలుగునాట చరిత్ర చాలా ముందుకు వెళ్ళిపోయింది.

ఇప్పుడు కూడా తెలంగాణలో మూడో ఎలక్షన్ ముందు ఒక ‘రెడ్డి’ని ముందు ఉంచి బరిలో దిగితే చాలు అనేదే ఢిల్లీ లెక్క అయింది. కానీ ఆ (రేవంత్) రెడ్డి, నాయుడు ‘లిబరల్ పాలిటిక్స్ స్కూల్’ ‘సెకండ్ జనరేషన్’ బ్యాచ్ అనే ఆరా ఢిల్లీలో లేకపోయింది. రాష్ట్రంలో ముఖం చెల్లని ఆ పార్టీ ఆ గెలుపుతో అదికూడా సరిపెట్టుకుంది. అ తర్వాత, కాలం చేసే ‘డిమాండ్ల’ను కాలరాసే నాయుడు శైలినే రేవంత్ అనుసరించడం ఇప్పుడు కొండా సురేఖ అంశంతో బయటకు వెల్లడి అయింది. ఏపీలో ఆర్ధిక సంస్కరణలను అప్రతిహతంగా అమలు చేసుకుంటూ పోతున్న నాయుడు ‘స్పీడు’ను అడ్డుకోవడం అనేది కాంగ్రెస్‌కు కేవలం ‘రెడ్డి ఫ్యాక్టర్’తో అవలేదని, అది- ‘రిఫామ్స్ విత్ హ్యూమన్ ఫేస్’ మాత్రమే అలిమి అయిందని, 2009కి ముందు ఏపీలో సోనియా గాంధీ ఉన్న వేదికలపై పీఎం మన్మోహన్ సింగ్ మాట్లాడిన సందర్భాలను తెలుగు ప్రజలు చూశారు. డా. వైఎస్ కూడా సీఎం అయ్యాక, అటు రాయలసీమ ఇటు తెలంగాణ రెడ్లతో ఎదుర్కొన్న అసమ్మతిని ఆయన అధిగమించిది, మొదటి నుంచి తాను పెంచిపోషించిన బహుజన వర్గాల ‘గ్రూపు’లతోనే! ఆ కాలంలో వరంగల్ వంటి ఉద్యమ జిల్లాల్లో ఉదయించిన ‘పోస్ట్ మండల్’ – ‘పోస్ట్ లిబరలైజేషన్’ బిసి మహిళా నాయకత్వం, అది ఇంకా ఏమాత్రం పాత ‘గౌతు లచ్చన్న స్కూల్’ కాదనే విషయం కొండా సురేఖ రాజకీయ ప్రస్థానం గమనిస్తే, ఇట్టే అర్ధం అవుతుంది.

సౌత్ ఇండియాలో డా. వైఎస్ పార్టీ పగ్గాలు చేపట్టాక, రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో కొండా సురేఖ వంటి వారి ‘టేకాఫ్’కు ‘రన్ వే’ పూర్తిగా మారిందని, అది కొత్తదని తెలిసినవాళ్ళు ఇక్కడ కొద్దిమంది మాత్రమే. అయితే, ఇదేమీ మధ్యప్రదేశ్ ‘మోడల్’కు భిన్నమైంది కాదు. ఇప్పటికీ 80’ దశకానికి ముందునాటి పాత ‘వెయిట్స్ అండ్ మెజర్స్’ టూల్స్ పట్టుకుని తిరిగే విశ్లేషకులు కొందరు బాబు-జగన్ మధ్య తేడా ఎక్కడుంది? అంటూ చర్చ మొదలుపెడతారు. రాష్ట్ర విభజన తర్వాత, తనదైన స్వంత పార్టీ ‘పబ్లిక్ పాలసీ’ని పాత కాంగ్రెస్ శ్రేణులతో అమలు చేసే బాలారిష్ట అవస్థల దశలో జగన్ ఉన్న విషయం తెలిసినవారు తక్కువ. ఏపీలో అందుకే ఢిల్లీ ఏఐసీసీ ‘రాడార్’తో పనిలేని వైఎస్ కొడుకు జగన్, కేవలం 11 మంది ఎంఎల్ఏ లను 8 మంది ఎంపీలను పెట్టుకుని నడుపుతున్న నర్మగర్భ రాజకీయ వ్యూహాల ‘గ్రామర్’ దాని పర్యవసానాలు ఎటువంటివో తెలియక నాయుడు ‘కూటమి’ దాని వ్యూహకర్తల అవస్థలకు పరిష్కారాలు దొరక్కపోవడం.

జాన్ సన్ చోరగుడి