గుడ్ బై చెప్పిన చిన్న శ్రీను
బొత్స క్యాంప్‌లో మారిపోయిన సీను
దూకుడు పెంచిన టీడీపీ.. డిఫెన్స్‌లో వైసీపీ
బెడిసికొట్టిన ఫ్యామిలీ ఎఫైర్
సత్తిబాబు ప్లాన్ మిస్ ఫైర్
ఉత్తరాంధ్రలో ఒక రాజీనామా.. ఇప్పుడు వైసీపీ అంతర్గత రాజకీయాలపై పెద్ద ప్రశ్నగా మారింది. బొత్స సత్యనారాయణ మేనల్లుడు, వైసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను పార్టీని వీడి టీడీపీలో చేరడం, ఆ తర్వాత కార్యకర్తల సమావేశంలో బొత్స భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇది కేవలం ఒక నాయకుడి పార్టీ మార్పేనా? లేక కుటుంబాల చుట్టూ నిర్మితమైన రాజకీయ వ్యవస్థకు కనిపిస్తున్న తొలి పగుళ్లలో ఒకటా? చిన్న శ్రీను నిష్క్రమణతో విజయనగరంలో మారుతున్న సమీకరణాలపై ఆసక్తి పెరిగితే.. మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ వేదిక ప్రకటన మరో ప్రశ్నను ముందుకు తెచ్చింది. అధికారాన్ని కోల్పోయిన వైసీపీకి ఇప్పుడు అసలు పరీక్ష ఎన్నికల ఫలితాల కంటే సంస్థాగత బలం. కుటుంబాల ప్రభావాన్ని కొనసాగిస్తూనే కుటుంబాల వెలుపల కొత్త నాయకత్వాన్ని ఎంతవరకు తయారు చేస్తుంది? ఒక కీలక నేత వెళ్లిపోయినా కేడర్‌ను నిలబెట్టే వ్యవస్థ ఉందా? జిల్లా స్థాయి నాయకత్వం వ్యక్తులపై ఆధారపడకుండా పార్టీపై నిలబడగలదా? బొత్స కన్నీటి వెనుక భావోద్వేగం ఎంత ఉన్నా.. దాని వెనుక దాగి ఉన్న రాజకీయ సంకేతం మరింత పెద్దది. కుటుంబం బలమా? పార్టీ బలమా? 2029కు ముందే ఈ రెండింటి మధ్య గీతను వైసీపీ ఎలా గీసుకోబోతోంది? అసలు కథ ఇదే..











