అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ.
ప్రజల సుఖసంతోషాల కోసం సీఎం ప్రార్థన.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. దసరా నవరాత్రుల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు, సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న సీఎం దంపతులకు అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పండితుల వేదమంత్రాల నడుమ అమ్మవారి అంతరాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వచన మండపంలో అర్చకులు వేదాశీస్సులు అందజేశారు. ఈవో శీనానాయక్ అమ్మవారి శేషవస్త్రాలను అందించగా, ఆలయ చైర్మన్, ఈవో అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. సీఎం దంపతులు పట్టువస్త్రాలు సమర్పించే సమయంలోనూ సామాన్య భక్తుల దర్శనాలకు అంతరాయం కలగకుండా క్యూ లైన్లను కొనసాగించారు.
ఆరు రోజుల్లో ఎనిమిది లక్షల దర్శనాలు
దర్శనం అనంతరం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యకరమైన, సంపన్నమైన సమాజంగా ఎదగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని, ఆరు రోజుల్లోనే ఎనిమిది లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారని వెల్లడించారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారని పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవ్ 2.0, జాతీయ సరస్ మేళా కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే స్థాయిలో విజయవాడ దసరా ఉత్సవాలు జరగడం సంతోషకరమని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ఆకాంక్షించారు.
#ChandrababuNaidu #KanakaDurgaDevi #Vijayawada #Indrakeeladri #Dasara #Navaratri #DurgaTemple #AndhraPradesh #VijayawadaDasara #SilkClothesOffering #SarasMela #APNews











