మహిళలను పక్కకు తప్పించడంపై రచ్చ.
బీఏపీఎస్ వివాదంపై కేంద్రం రియాక్షన్.
పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ వద్ద బీఏపీఎస్ హిందూ మత సంస్థ ప్రతినిధుల పర్యటన వివాదంగా మారింది. సుమారు 100 మంది సభ్యులతో కూడిన బీఏపీఎస్ బృందం ప్రైవేట్ పర్యటనకు వెళ్లిన సమయంలో మహిళా ఉద్యోగులను పక్కకు తప్పించారన్న ఆరోపణలు వచ్చాయి. కొందరిని విధుల నుంచి ఇతర ప్రాంతాలకు పంపించారని, మరికొందరి స్థానాల్లో పురుష ఉద్యోగులను నియమించారని ఈఫిల్ టవర్ సిబ్బంది ఆరోపించారు. బృందం అక్కడ ఉన్నంతసేపు మహిళా ఉద్యోగులు కొన్ని ప్రాంతాల్లోకి వెళ్లకూడదని ఆదేశాలు ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. ఈ పరిణామంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సిబ్బంది సమ్మెకు దిగారు. దీంతో ఈఫిల్ టవర్ సోమవారం పూర్తిగా మూతపడింది.
ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది?
ఎఫిల్ టవర్ నిర్వహణ సంస్థ ఎస్ఈటీఈ ప్రకారం, బీఏపీఎస్ ప్రతినిధులు పర్యటన సందర్భంగా మహిళలతో పరస్పర సంబంధాలను సాధ్యమైనంత వరకు పరిమితం చేయాలని కోరినట్లు వెల్లడించింది. అలాంటి షరతులను అంగీకరించడం తప్పేనని ఎస్ఈటీఈ స్పష్టం చేసింది. పురుషులు, మహిళలకు సమానత్వం అనే ఫ్రాన్స్ విలువలకు ఇది విరుద్ధమని పేర్కొంది. సంస్థ అధ్యక్షుడు ఏరియల్ వెయిల్ కూడా ఈ విధానం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై పారిస్ అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. ఫ్రాన్స్ సమానత్వ శాఖ మంత్రి ఆరోర్ బెర్జ్ తీవ్రంగా స్పందిస్తూ మహిళలు తమ ఉనికిని దాచుకోవాలని ఫ్రాన్స్‌లో ఎవరూ చెప్పలేరని అన్నారు. ఫ్రాన్స్ రాజకీయ వర్గాల్లోనూ ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి.
భారత్ ఏమంది?
ఈ వివాదంపై భారత విదేశాంగ శాఖ మాత్రం బీఏపీఎస్ ఆలయం ప్రారంభోత్సవం, ఎఫిల్ టవర్ ఘటన రెండింటినీ వేర్వేరు అంశాలుగా చూసింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ ఎఫిల్ టవర్‌కు సంబంధించిన వ్యవహారం సంబంధిత సంస్థల మధ్య ఉన్న అంశమని స్పష్టం చేశారు. పారిస్ ప్రాంతంలో బీఏపీఎస్ ఆలయం ప్రారంభమైన విషయం తమకు తెలుసని తెలిపారు. ఆలయ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా శుభాకాంక్షలు చెప్పడం సాధారణ ప్రభుత్వ విధానంలో భాగమేనని చెప్పారు. ఎఫిల్ టవర్ వివాదంపై కేంద్రం ఎలాంటి ప్రత్యేక వ్యాఖ్య చేయలేదు.
బీఏపీఎస్ వివరణ ఏమిటి?
వివాదం తర్వాత బీఏపీఎస్ స్పందిస్తూ తమపై వచ్చిన ఆందోళనలను గౌరవిస్తున్నామని, విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపింది. తమ ప్రతినిధుల సంఖ్య పెద్దగా ఉండటంతో సాధారణ సందర్శకులకు ఇబ్బంది కలగకుండా ఎఫిల్ టవర్ సిబ్బందితో సమన్వయం చేసుకుని పర్యటన ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఎవరినీ ఎఫిల్ టవర్‌లోకి రాకుండా అడ్డుకోలేదని తెలిపింది. అయితే ఈ ఘటనతో ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమాపణలు చెబుతున్నామని స్పష్టం చేసింది. పరస్పర గౌరవం, సేవాభావం వంటి విశ్వవ్యాప్త విలువలకు తాము కట్టుబడి ఉన్నామని బీఏపీఎస్ ప్రకటించింది.
అసలు వివాదం ఏమిటంటే?
ఈ వ్యవహారంలో ప్రధాన ప్రశ్న మత విశ్వాసాల పేరుతో మహిళా ఉద్యోగుల విధులను పరిమితం చేయడం ఎంతవరకు సమంజసం? అన్నదే. బీఏపీఎస్ తన పర్యటనలో మహిళలతో పరస్పర సంబంధాలను తగ్గించాలని కోరిందన్నది ఎస్ఈటీఈ వాదన. ఆ షరతులను అమలు చేయడం ద్వారా మహిళలను విధుల నుంచి తప్పించారన్నది సిబ్బంది ఆరోపణ. మరోవైపు బీఏపీఎస్ మాత్రం తాము ఎవరినీ నిరోధించలేదని వివరణ ఇచ్చింది. దీంతో ఘటనపై ఫ్రాన్స్‌లో లింగ సమానత్వం, మత స్వేచ్ఛ, సంస్థల బాధ్యత వంటి అంశాలపై పెద్ద చర్చ మొదలైంది.
#BAPS #BAPSEiffelTower #EiffelTower #EiffelTowerControversy #BAPSControversy #BAPSParis #Paris #France #WomenStaff #GenderEquality #StaffProtest #EiffelTowerShutdown #BAPSTemple #BAPSTempleParis #RandhirJaiswal #IndiaFrance #ReligiousFreedom #FrancePolitics #WomenRights #ParisNews #InternationalNews











