Home Inter National News కశ్మీర్‌పై ఓఐసీ వ్యాఖ్యలు

కశ్మీర్‌పై ఓఐసీ వ్యాఖ్యలు

మీకా హక్కు లేదన్న భారత్.

కశ్మీర్‌ అంశంపై ఇస్లామిక్‌ సహకార సంస్థ (ఓఐసీ) కాంటాక్ట్‌ గ్రూప్‌ చేసిన వ్యాఖ్యలను భారత్‌ తీవ్రంగా తిరస్కరించింది. కశ్మీర్‌ వ్యవహారం పూర్తిగా భారత అంతర్గత అంశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్‌, లడఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాలు భారత్‌లో అంతర్భాగాలని పేర్కొంది. రాజకీయ ప్రేరేపిత ప్రచారాన్ని పదేపదే ప్రస్తావించినంత మాత్రాన వాస్తవాలు మారవని తేల్చిచెప్పింది. ఇటువంటి వ్యాఖ్యలకు మద్దతు ఇవ్వడం ద్వారా OIC విశ్వసనీయతపైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.

ఓఐసీ ప్రకటనపై భారత్‌ అభ్యంతరం

ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సెప్టెంబర్‌ 22న ఓఐసీ కాంటాక్ట్‌ గ్రూప్‌ సమావేశమైంది. అజర్‌బైజాన్‌, పాకిస్థాన్‌, సౌదీ అరేబియా, టర్కియే ఇందులో సభ్యులుగా ఉన్నాయి. 2025 మేలో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన ఘర్షణపై ఆందోళన వ్యక్తం చేసిన గ్రూప్‌.. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద లక్ష్యాలపై భారత్‌ చేసిన దాడులను చట్టవిరుద్ధంగా అభివర్ణించింది. జమ్మూకశ్మీర్‌ వివాదానికి తుది పరిష్కారం లభించినప్పుడే దక్షిణాసియాలో శాశ్వత శాంతి, స్థిరత్వం సాధ్యమని పేర్కొంది. ఈ వ్యాఖ్యలపైనే భారత్‌ తీవ్రంగా స్పందించింది.

పాకిస్థాన్‌కు ఓఐసీ సూచనలు చేయాలి

ఓఐసీ ప్రకటనను భారత విదేశాంగ శాఖ “కల్పిత, ప్రేరేపిత ప్రచారం”గా అభివర్ణించింది. కశ్మీర్‌పై వ్యాఖ్యలు చేయడం కంటే పాకిస్థాన్‌కు ఉగ్రవాదంపై సలహా ఇవ్వాలని సూచించింది. ఉగ్రవాదానికి మద్దతు, ప్రోత్సాహం ఇచ్చిన చరిత్ర పాకిస్థాన్‌కు ఉందని భారత ప్రభుత్వం ఆరోపించింది. పాకిస్థాన్‌ నియంత్రణలోని ప్రాంతాల నుంచి వెలువడుతున్న ఉగ్రవాద ముప్పును ముందుగా పరిష్కరించుకోవాలని OICను కోరింది. భారత్‌ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేసినా తమ వైఖరిలో మార్పు ఉండదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

 

#OIC #Kashmir #JammuAndKashmir #India #Pakistan #OICContactGroup #MEA #MinistryOfExternalAffairs #Ladakh #KashmirIssue #IndiaPakistan #UNGA2026 #SouthAsia #Diplomacy #WorldNews