సాక్ష్యాలతో వైసీపీ ఎమ్మెల్సీ నిప్పులు .
మెగా డీఎస్సీ నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని పక్కా ఆధారాలతో బయటపెట్టినా ప్రభుత్వం బుకాయింపులకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దాదాపు 3.3 లక్షల మంది నిరుద్యోగుల తరఫున జూన్ నుంచి డీఎస్సీ అక్రమాలపై పోరాడుతున్నామని చెప్పారు. నిబంధనలను సవరించకుండా అధికారులు మినహాయింపులు ఇచ్చి నియామకాలు ఎలా చెల్లుబాటు చేస్తారని ప్రశ్నించారు. ఇందుకు నాలుగు ఉదాహరణలను ఆయన ప్రస్తావించారు. ఈడిగ ప్రభాకర్ ఎస్జీటీ నియామకంలో టెట్ అర్హతపై స్పష్టత లేకున్నా 2018లో 77 మార్కులు వచ్చాయని పీపీటీ ద్వారా తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. జె.ఉష బయలాజికల్ సైన్స్ పోస్టుకు దరఖాస్తు చేస్తే నిబంధనలకు విరుద్ధంగా తెలుగు స్కూల్ అసిస్టెంట్ పోస్టు ఎలా కేటాయించారని ప్రశ్నించారు. టెట్ నిబంధనలను మార్చకుండానే ఈ నియామకం ఎలా సాధ్యమైందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్‌కుమార్‌కు సంబంధిత అర్హతలు లేకున్నా, టెట్ రాయకున్నా, డీఎస్సీకి హాజరు కాకున్నా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఉద్యోగం ఇచ్చారని ఆరోపించారు. స్పోర్ట్స్ డీఎస్సీలో పెద్దాడ అప్పలరాజుకు తన తమ్ముడి సర్టిఫికెట్‌తో ఉద్యోగం ఇచ్చినట్లు అధికారిక వెబ్‌సైట్ ఆధారాలు వెల్లడించాయని, ఆధారాలు బయటపడిన తర్వాత పోర్టల్‌లో సర్టిఫికెట్లు మార్చారని ఆరోపించారు.
రూల్స్ మార్చకుండానే నియామకాలా?
స్పోర్ట్స్ కోటాలో 20 శాతం వెయిటేజీని తొలగించడం, సర్టిఫికెట్ల పరిశీలన విధానాన్ని మార్చడం వెనుక కారణమేంటని చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. 2018 నిబంధనల ప్రకారం గ్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా స్కిల్ టెస్ట్‌కు వెయిటేజీ ఇవ్వాల్సి ఉన్నా ఈ డీఎస్సీలో దాన్ని తొలగించారని ఆరోపించారు. జిల్లా స్థాయిలో డీఎస్‌డీవోల పరిశీలన, కలెక్టర్లు–డీఈవోల పర్యవేక్షణలో జరిగే 1:1 ధ్రువపత్రాల వెరిఫికేషన్‌ను కూడా ఎత్తివేసి శాప్ కార్యాలయం నుంచే లిస్టులు తయారు చేసి ఉద్యోగాలు ఇచ్చారని విమర్శించారు. జీఓ ఎంఎస్ నెం.4, 47లో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా కూన రవికుమార్ సంతకాలను స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎలాంటి జీఓ సవరణ చేయకుండా ఇలాంటి నియామకాలను ఎలా సమర్థిస్తుందని నిలదీశారు. మరోవైపు గ్రీవెన్స్‌లో వేలాది మంది పెట్టుకున్న దరఖాస్తులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా అర్హులకు పోస్టింగులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కోర్టు ఉత్తర్వులు ఉన్న 100 మంది జెన్యూన్ అభ్యర్థుల కేసులను అధికారుల ముందుకు తీసుకొస్తామని, వారికి గ్రీవెన్స్ ద్వారా వెంటనే పోస్టింగులు ఇచ్చి న్యాయం చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని చంద్రశేఖర్‌రెడ్డి సవాల్ చేశారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం భవిష్యత్తులో సమాధానం చెప్పాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
#MegaDSC #MegaDSC2025 #MegaDSCIrregularities #MegaDSCEvidence #DSCRecruitment #APDSC #ChandrasekharReddy #YSRCP #YSRCPMLC #TeacherRecruitment #APTeacherJobs #DSCControversy #SportsQuota #SportsDSC #SportsCertificates #TETEligibility #TET #CertificateVerification #APEducation #APSchoolEducation #APHighCourt #AndhraPradeshPolitics #APNews











