Home General ఢిల్లీలో కుప్పకూలిన భవనం ఘటనలో నలుగురు మృతి

ఢిల్లీలో కుప్పకూలిన భవనం ఘటనలో నలుగురు మృతి

శిథిలాల కింద మరికొందరు?

ఢిల్లీలోని సత్య నికేతన్‌లో ఆదివారం మధ్యాహ్నం భారీ విషాదం చోటుచేసుకుంది. ఆరు అంతస్తుల భవనం కుప్పకూలడంతో నలుగురు మృతి చెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు తొమ్మిది మందిని సురక్షితంగా బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌కు సమీపంలోని ఈ ప్రాంతంలో విద్యార్థులు ఎక్కువగా ఉంటారు. కూలిపోయిన భవనం 75 పడకల పేయింగ్ గెస్ట్‌ వసతి గృహంగా కొనసాగుతోంది. ప్రమాదం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో జరిగింది. స్థానికుల ప్రకారం భవనంలో సుమారు 50 మంది విద్యార్థులు ఉండే అవకాశం ఉంది. ఆదివారం కావడంతో ఎక్కువ మంది తమ గదుల్లోనే ఉన్నారని చెబుతున్నారు. శిథిలాల కింద నుంచి కేకలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

బేస్‌మెంట్‌ పనులే కారణమా?

ప్రమాద సమాచారం అందిన వెంటనే ఢిల్లీ పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది, డీడీఎంఏ బృందాలు రంగంలోకి దిగాయి. 12కు పైగా ఫైర్‌ టెండర్లు, ఎక్స్‌కవేటర్‌, అంబులెన్సులతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. భారీ కాంక్రీట్‌ శ్లాబులు, ఇనుప గర్డర్లను తొలగిస్తూ ప్రాణాల కోసం గాలిస్తున్నారు. స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భవనం 40–50 ఏళ్ల నాటిది. బేస్‌మెంట్‌తో పాటు పైగా ఐదు అంతస్తులు ఉన్నాయి. బేస్‌మెంట్‌లో మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలోనే భవనం కూలిపోయింది. ముందు జాగ్రత్తగా పక్క భవనాన్ని ఖాళీ చేయించారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తా సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తరంజిత్‌ సింగ్‌ సంధు కూడా అధికారులను సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే భవనాల నిర్మాణ నాణ్యత, అధికారుల నిర్లక్ష్యంపై ఆప్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్‌ ఆరోపణలు చేశారు. ప్రమాదానికి అసలు కారణమేంటన్న దానిపై దర్యాప్తు కీలకంగా మారింది.

 

#DelhiBuildingCollapse #SatyaNiketan #DelhiAccident #BuildingCollapse #DelhiNews #SatyaNiketanAccident #DelhiRescueOperation #NDRF #DelhiPolice #DelhiFireServices #DDMA #RescueOperation #BuildingCollapseDeaths #DelhiCM #RekhaGupta #TaranjitSinghSandhu #SaurabhBharadwaj #BuildingSafety #DelhiTragedy