హైదరాబాద్ నగర ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం కీలక సౌకర్యం అందించేందుకు సిద్ధమవుతోంది. మెట్రో రైల్, టీజీఎస్ఆర్టీసీ బస్సులకు ఒకే జాయింట్ పాస్ తీసుకొచ్చే దిశగా చర్యలు వేగం పుంజుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదివారం హైదరాబాద్ మెట్రో రైల్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై ఈ అంశంపై సమీక్షించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రోజువారీ, నెలవారీ జాయింట్ పాస్‌లు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మెట్రో, ఆర్టీసీ ప్రయాణానికి వేర్వేరు టికెట్లు, పాస్‌లు తీసుకోవాల్సి వస్తుండటంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్త విధానం అమల్లోకి వస్తే ఒకే పాస్‌తో మెట్రో రైల్ నుంచి ఆర్టీసీ బస్సుకు, బస్సు నుంచి మెట్రోకు సులభంగా మారే అవకాశం ఉంటుంది. దీనివల్ల నగర ప్రజలకు సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు ప్రజా రవాణా వినియోగం పెరిగే అవకాశం ఉంది.
ఓల్డ్‌సిటీ మెట్రోపై స్పీడ్
సీఎస్ సంజయ్ జాజు ఓల్డ్‌సిటీ మెట్రో కారిడార్ రోడ్డు విస్తరణ పనుల ప్రస్తుత పరిస్థితిని కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. 7.5 కిలోమీటర్ల ఓల్డ్‌సిటీ మెట్రో కారిడార్‌కు జనరల్ కన్సల్టెంట్ నియామకం కోసం జరుగుతున్న టెండర్ ప్రక్రియపై అధికారులు వివరాలు అందించారు. పనులను వేగవంతం చేసి మెట్రో ప్రాజెక్టు కార్యకలాపాలు వీలైనంత త్వరగా ప్రారంభించాలని జాజు ఆదేశించారు. మరోవైపు ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైల్, టీజీఎస్ఆర్టీసీ అధికారులు జాయింట్ పాస్ జారీకి తాము సాంకేతికంగా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అమలుకు అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలిపారు. దీంతో జాయింట్ పాస్ ఫేర్ నిర్మాణాన్ని త్వరగా ఖరారు చేసి, పాస్ విధానాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని సీఎస్ ఆదేశించారు. ప్రయాణికులకు మెట్రో-ఆర్టీసీ అనుసంధానం మరింత సులభం కానుంది.
#HyderabadMetro #TGSRTC #MetroRTCJointPass #HyderabadJointPass #HyderabadMetroRail #TGSRTCJointPass #HyderabadTransport #PublicTransport #HyderabadCommuters #MetroBusConnectivity #DailyPass #MonthlyPass #OldCityMetro #HyderabadOldCityMetro #SanjayJaju #LTHyderabadMetro #TelanganaGovernment #HyderabadNews











