Home Sports_News నేడు భారత్‌-పాక్‌ పోరు.. బ్యాటింగ్‌కు పరీక్ష

నేడు భారత్‌-పాక్‌ పోరు.. బ్యాటింగ్‌కు పరీక్ష

సెమీస్‌ బెర్త్‌ ఖాయం.. పోరు మాత్రం కీలకం.

మహిళల టీ20 ఆసియా కప్‌లో భారత్‌–పాకిస్థాన్‌ మ్యాచ్‌ శనివారం దుబాయ్‌లో జరగనుంది. భారత్‌ ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సెమీఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. పాకిస్థాన్‌ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడినా, తదుపరి మ్యాచ్‌ హాంకాంగ్‌తో ఉండటంతో నాకౌట్‌ చేరే అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి. అందుకే ఈ మ్యాచ్‌లో ఫలితం కంటే ఇరు జట్ల బ్యాటింగ్‌ లోతు ప్రధాన పరీక్షగా మారింది. భారత్‌ ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ అద్భుతంగా రాణిస్తున్నారు. మంధాన 143 పరుగులతో టాప్‌లో ఉండగా, షఫాలీ 92 పరుగులు చేసింది. అయితే థాయ్‌లాండ్‌పై భారత్‌ 46 పరుగులకే 8 వికెట్లు కోల్పోవడం, హాంకాంగ్‌పై 3 నుంచి 7 స్థానాల్లోని బ్యాటర్లు కలిపి 34 పరుగులే చేయడం మిడిలార్డర్‌ బలహీనతను బయటపెట్టాయి.

స్పిన్నర్లకు అనుకూలంగా దుబాయ్‌

పాకిస్థాన్‌ కూడా బ్యాటింగ్‌లో ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటోంది. అయితే శ్రీలంక పర్యటనలో షవాల్‌ జుల్ఫికార్, మునీబా అలీ దూకుడైన బ్యాటింగ్‌తో 170కిపైగా స్కోర్లు సాధించారు. భారత్‌కు ప్రేమా రావత్‌ స్పిన్‌లో కీలకంగా మారగా, పాకిస్థాన్‌ నష్రా సంధూ ప్రధాన ఆయుధంగా కనిపిస్తోంది. భారత్‌పై సంధూకు మంచి రికార్డు ఉంది. ఆసియా కప్‌లో భారత్‌–పాక్‌ ఇప్పటివరకు ఏడుసార్లు తలపడగా భారత్‌ 6-1 ఆధిక్యంలో ఉంది. దుబాయ్‌ పిచ్‌పై స్పిన్నర్లకు ఎక్కువ సహకారం లభిస్తోంది. ఇప్పటివరకు స్పిన్నర్లు 71 వికెట్లు పడగొట్టారు. దీంతో టాస్‌ గెలిచిన జట్టు నిర్ణయం కూడా కీలకం కానుంది.

 

#IndiaVsPakistan #WomensT20AsiaCup #IndiaWomen #PakistanWomen #SmritiMandhana #ShafaliVerma #NashraSandhu #DubaiCricket #WomensCricket #AsiaCup #IndiaPakistanMatch #CricketNews