Home General హెచ్‌-4 ఉద్యోగాలకు అమెరికా కోత

హెచ్‌-4 ఉద్యోగాలకు అమెరికా కోత

భారతీయులపై పెను ప్రభావం
హెచ్‌-1బీ కుటుంబాలకు కొత్త కష్టాలు

అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ హెచ్‌-1బీ వీసాదారుల కుటుంబాలకు ట్రంప్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన తాజా నిబంధన ఆందోళన కలిగిస్తోంది. హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పిస్తున్న హెచ్‌-4 ఈఏడీ విధానాన్ని తొలగించే ప్రతిపాదనను అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ ముందుకు తెచ్చింది. 2015లో అమల్లోకి వచ్చిన ఈ విధానం వల్ల అర్హత ఉన్న హెచ్‌-4 వీసా జీవిత భాగస్వాములు ప్రత్యేక ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌ తీసుకుని అమెరికాలో చట్టబద్ధంగా పనిచేసే అవకాశం పొందుతున్నారు. ఇప్పుడు ఆ నిబంధనను వెనక్కి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే హెచ్‌-4 వీసాపై ఆధారపడిన వేలాది మంది జీవిత భాగస్వాములు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడొచ్చు. ముఖ్యంగా భారతీయ కుటుంబాలపై ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 2014 నుంచి 2017 మధ్య హెచ్‌-4 ఈఏడీ దరఖాస్తుల ఆమోదాల్లో 93 శాతం భారతీయులకు దక్కగా, వారిలో 94 శాతం మహిళలే ఉన్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఈ ప్రతిపాదన భారతీయ మహిళా ఉద్యోగులపై ప్రత్యేక ప్రభావం చూపే అవకాశం ఉంది.

ప్రతిపాదన దశలో ప్లాన్

అయితే హెచ్‌-4 ఉద్యోగ అనుమతులు వెంటనే రద్దు కావడం లేదు. ఇది ప్రస్తుతం ప్రతిపాదన మాత్రమే. అమల్లోకి రావాలంటే హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ముందుగా అధికారిక ప్రతిపాదనను ఫెడరల్‌ రిజిస్టర్‌లో ప్రచురించాలి. ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించాలి. ఆ ప్రక్రియ పూర్తయ్యాక తుది నిబంధనను ప్రకటించాలి. అప్పటివరకు చెల్లుబాటు అయ్యే ఈఏడీ ఉన్న హెచ్‌-4 జీవిత భాగస్వాములు ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యోగాలు కొనసాగించవచ్చు. హెచ్‌-4 వీసా స్వయంగా ఉద్యోగం చేసుకునే అనుమతి ఇవ్వదు. హెచ్‌-1బీ వీసాదారుడి జీవిత భాగస్వామి లేదా పిల్లలు అమెరికాలో నివసించేందుకు ఈ వీసా ఉపయోగపడుతుంది. ఉద్యోగం చేసేందుకు అర్హత ఉన్న జీవిత భాగస్వామికి ప్రత్యేక ఈఏడీ అవసరం. సాధారణంగా గ్రీన్‌కార్డ్‌ ప్రక్రియలో ఉన్న హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇలాంటి ప్రతిపాదన గతంలోనూ వచ్చింది. ట్రంప్‌ తొలి పాలనా కాలంలో 2017లో హెచ్‌-4 ఈఏడీని తొలగించే ప్రయత్నం జరిగినా అది తుది నిబంధనగా మారలేదు.

హెచ్‌-1బీపై వరుస దెబ్బలు

హెచ్‌-4 ఈఏడీపై తాజా ప్రతిపాదన ఒక్కటే కాదు. హెచ్‌-1బీ వ్యవస్థపై అమెరికా ప్రభుత్వం వరుసగా కఠిన చర్యలు పరిశీలిస్తోంది. కొత్త హెచ్‌-1బీ నియామకాలకు భారీగా ఫీజు పెంచే ప్రతిపాదన కూడా ఉంది. ఉద్యోగం కోల్పోయిన హెచ్‌-1బీ ఉద్యోగులకు కొత్త యజమాని కోసం వెతకడానికి ప్రస్తుతం ఉన్న 60 రోజుల వ్యవధిని తొలగించే ప్రతిపాదనపై కూడా చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల మధ్య భారతీయులపై ప్రభావం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆమోదమైన హెచ్‌-1బీ పిటిషన్లలో సుమారు 71 శాతం భారతీయులవేనని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో హెచ్‌-1బీ ఉద్యోగులు మాత్రమే కాకుండా వారిపై ఆధారపడిన కుటుంబాల భవిష్యత్తుపైనా అమెరికా వీసా విధానాల మార్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే హెచ్‌-4 ఈఏడీ రద్దు ఇప్పటికీ తుది నిర్ణయం కాదు. కాబట్టి ప్రస్తుతానికి చెల్లుబాటు అయ్యే వర్క్‌ పర్మిట్‌ ఉన్నవారు ఉద్యోగాలు కొనసాగించవచ్చు. తుది నిబంధన ఎప్పుడు వస్తుంది, దాని పరిధి ఎంత ఉంటుంది, ప్రస్తుత ఈఏడీలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్నది తదుపరి అధికారిక ప్రక్రియలోనే స్పష్టమవుతుంది.

 

#H4EAD #H1BVisa #H4Visa #TrumpAdministration #USImmigration #IndianFamilies #IndianProfessionals #H4EADJobs #H1BFamilies #USVisaRules #ImmigrationNews #IndianWomen #DHS #H1BDependents