అల్లా సాక్షిగా అన్యాయం… విశాఖలో ముస్లింల ఆవేదన.. టీడీపీకి కొత్త తలనొప్పి

తెగని సీట్ల పంచాయితీ.. ప్రాధాన్యత కోసం ముస్లింల డిమాండ్

అల్లా సాక్షిగా తమకు అన్యాయం జరిగిందని ఆవేదన

అల్లా సాక్షిగా తమకు అన్యాయం జరిగిందని ముస్లింలు వాపోతున్నారు. జనాభాలో దాదాపు నాలుగు శాతం ఉన్న తమకు నగరపాలక సంస్థ ఎన్నికల్లో మొండి చేయి చూపిస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. దశాబ్దాల తరబడి తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాసిన ముస్లింలకు ప్రాధాన్యత లేదని వాపోతున్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో వార్డుల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందని అంటున్నారు. అధిష్ఠానం చెప్పినా స్థానిక నేతలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్‌లు జోక్యం చేసుకొని ముస్లింలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

విశాఖలో 3.85 శాతం ముస్లిం జనాభా

విశాఖ నగరంలో 3.85 శాతం ముస్లిం జనాభా ఉంది. వారిలో 65% సున్ని జమాత్,  షియా జమాత్ 5%, ఆహేలే హదీస్ జమాత్ 15%, తబ్లికి జమాత్ 15% ఉన్నారు.  దాదాపు మూడు లక్షలకు పైబడి ముస్లిం ఓటర్లు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. విశాఖ మహానగరపాలక సంస్థ 120 వార్డులకు పెరిగింది. గతంలో విశాఖలో ముస్లింలకు ప్రాధాన్యత కల్పించిన పార్టీ తెలుగుదేశం. ముస్లింల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. మసీదుల అభివృద్ధి, కళ్యాణ మండపాలు, రోడ్లు, సంక్షేమ పథకాలు అమలు చేసింది. ముఖ్యంగా ప్రస్తుతం సౌత్ నియోజకవర్గంలోని ఒకప్పటి ఓల్డ్ టౌన్ ఏరియాలో ముస్లింలు అధికంగా ఉన్నారు.

విస్తరించిన విశాఖ ముస్లింలు

విశాఖ నగరంతో పాటు విశాఖలో ముస్లింల సంఖ్య కూడా విస్తరించింది. ఒకప్పుడు ఓల్డ్ టౌన్‌కు పరిమితమైన ముస్లింలు గాజువాక, తూర్పు నియోజకవర్గం, ఇతర ప్రాంతాల్లో జనాభాపరంగా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలలో వీరి పాత్ర తక్కువేమీ కాదు. అన్న ఎన్టీఆర్ హయాంలో ఒకటో నియోజకవర్గం నుంచి డాక్టర్ ఎస్.ఏ. రెహమాన్ శాసనసభ్యుడిగా గెలిచారు. అనంతరం విశాఖ నగరాభివృద్ధి సంస్థ హుడా చైర్మన్‌గా కూడా పనిచేశారు. రెహమాన్ హయాంలో ముస్లింలకు విశాఖలో పెద్దపీట వేశారని చెప్పవచ్చు. విశాఖలో టీడీపీకి పెద్ద దిక్కుగా పేరుపొందిన ఎం.వి.వి.ఎస్. మూర్తి ముస్లింలకు ప్రాధాన్యత ఇచ్చారు.

పట్టించుకోని టీడీపీ.. నిరాశలో ఆశావహులు

జీవీఎంసీ ఎన్నికల్లో ముస్లింలకు నిరాశ ఎదురవుతోంది. తెలుగుదేశం పార్టీకి దశాబ్దాలుగా సేవలందిస్తున్న కార్యకర్తలు కార్పొరేషన్ ఎన్నికల కోసం వేయికళ్లతో ఎదురుచూశారు. తమ నేతలు హామీ ఇచ్చారని వార్డుల్లో లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు. చివరి నిమిషంలో కూటమి పొత్తులు కొలిక్కి రాలేదు. ఆశావహులు తమ నేతలను నమ్మి నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన పూర్తయిన తర్వాత కూడా అభ్యర్థిత్వం ఖరారు కాకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గం నుంచి ఒకరు, గాజువాక, పెందుర్తి నియోజకవర్గాల నుంచి ఇద్దరు కార్పొరేటర్ సీట్లు ఆశిస్తున్నారు. స్థానికంగా పలుకుబడి, ఆర్థిక స్థిరత్వం ఉన్న వీరికి టికెట్లు కేటాయించాలని అభ్యర్థించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పొత్తుల చర్చలు ఫైనల్ కాకపోవడంతో వీరి పరిస్థితి డోలాయమానంగా మారింది.

ఫలించని ముస్లిం పెద్దల ప్రయత్నాలు

విశాఖ తెలుగుదేశం పార్టీలో ఎన్నికల పరిశీలకుడిగా ఎం.ఏ. షరీఫ్ ఉన్నారు. ఎన్నికల కమిటీలో ఉన్నప్పటికీ ఫలితం లేకపోయిందని ముస్లింలు వాపోతున్నారు. విశాఖ నగరంలో సున్నీ జమాత్‌కు 65 శాతం, షియా జమాత్‌కు ఐదు శాతం జనాభా ఉందని పేర్కొంటున్నారు. అహ్లే హదీస్ జమాత్, తబ్లిగీ జమాత్ వర్గాల నుంచి దాదాపు రెండు శాతం ఓటర్లు ఉన్నారు. 80 మసీదీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీరత్ కమిటీ వైస్ ప్రెసిడెంట్‌కు కూడా కార్పొరేటర్ సీటు లభించలేదు.  పార్టీనే నమ్ముకున్నవారికి మొండి చేయి చూపడం విశేషం. గతంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన కార్యక్రమాల్లో దక్షిణ నియోజకవర్గంలో సమర్థవంతంగా వ్యవహరించి, లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేకపోతోందని వాపోతున్నారు.

వైఎస్సార్‌సీపీ పెద్దపీట

వివిధ వర్గాల పెద్దలతో పాటు నగరంలో అందరికీ ప్రాతినిధ్యం వహించే ఆల్ మసీద్ కమిటీ పెద్దలు సైతం తెలుగుదేశం పార్టీ నేతలను కలిశారు. తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలను ఎదుర్కోవడానికి తగిన అంగబలం, అర్థబలం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పినట్లు ముస్లిం పెద్దలు ఆరోపిస్తున్నారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ నగరంలో నలుగురు ముస్లింలకు స్థానాలు కేటాయించింది. ముస్లిం వర్గాలకు పెద్దపీట వేస్తున్నామని ప్రచారం చేసుకుంటోంది. ప్రచారంలో ఈ అంశం తెలుగుదేశం పార్టీకి కొంత నష్టం కలిగించే అవకాశం ఉంది. ఇప్పటికైనా పార్టీ అధిష్ఠాన వర్గం, స్థానిక నేతలు మరోసారి ఆలోచించి ముస్లింలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆ వర్గాలు కోరుతున్నాయి.

ముస్లింల అసంతృప్తి టీడీపీకి ఇబ్బందేనా?

తెలుగుదేశం పార్టీ ముస్లింలకు న్యాయం చేయకపోతే కార్పొరేషన్ ఎన్నికల్లో వారిలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. మేయర్‌తో పాటు కార్పొరేటర్ స్థానాలకు కూడా ముస్లింల వ్యతిరేకత ఇబ్బంది కలిగించే అంశంగా భావించవచ్చు. తెలుగుదేశం పార్టీ అధిష్ఠాన వర్గం, స్థానిక నేతలు సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని, తమకు న్యాయం చేస్తారని ముస్లిం పెద్దలు భావిస్తున్నారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి తమ మద్దతు ఉండాలంటే దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ముస్లింలు తెలుగుదేశం పార్టీకి మళ్లీ జై కొడతారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ముస్లింల మద్దతు దూరమైతే తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సిందే.

కేసానపల్లి కోటేశ్వరరావు
ఇన్‌పుట్ ఎడిటర్, నాదేశం