స్థానిక ఎన్నికలే అసలు పరీక్ష!
క్షేత్రస్థాయి నెట్వర్క్ పెంచాలి.
ప్రజలకు వాస్తవాలు చెప్పాలి.
సందేశం ప్రతి ఓటరుకు చేరాలి.
స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల పిలుపు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం కీలక పాత్ర పోషించాలని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. కంటెంట్ తయారు చేయడమే కాదు.. దాన్ని వెయ్యి మందికి, పదివేల మందికి, లక్ష మందికి ఎంత వేగంగా చేరవేస్తున్నామన్నదే సోషల్ మీడియా అసలైన సామర్థ్యమని స్పష్టం చేశారు. ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గంలో నెట్‌వర్క్‌ను బలోపేతం చేసి వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర వేదికల ద్వారా పార్టీ సందేశాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. పార్టీ అనుబంధ విభాగాలతో సమన్వయం పెంచుకోవాలని చెప్పారు.
స్థానిక సమస్యలే ప్రచారానికి ప్రధాన బలం
రాష్ట్రస్థాయి రాజకీయ అంశాలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని సజ్జల సూచించారు. పెన్షన్ల తొలగింపు, సంక్షేమ పథకాల అందకపోవడం, ఉద్యోగుల ఇబ్బందులు, విద్యార్థుల ఫీజులు, రైతుల సమస్యలు, ధరల పెరుగుదల వంటి అంశాలను వాస్తవాలు, గణాంకాలతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. మహిళలు, యువత, రైతులు, ఉద్యోగుల సమస్యలపై సంబంధిత విభాగాలు కంటెంట్ రూపొందిస్తే సోషల్ మీడియా బృందాలు దాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. స్థానికంగా స్పష్టంగా మాట్లాడగలిగే రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, ఇన్ఫ్లూయన్సర్లను గుర్తించి వీడియోలు, అభిప్రాయాలు రూపొందించాలని సూచించారు. ఎన్నికల సమయంలో నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు అడ్డంకులు, అధికారుల దుర్వినియోగం, పోలీసుల జోక్యం, ప్రత్యర్థుల దౌర్జన్యాలు చోటుచేసుకుంటే వీడియో ఆధారాలను భద్రపరచి, అవసరమైతే ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు, న్యాయపరమైన చర్యలకు వినియోగించాలని చెప్పారు.
హుందా భాషతోనే రాజకీయ పోరాటం
సోషల్ మీడియా కార్యకర్తలు ఆన్‌లైన్‌కే పరిమితం కాకుండా నామినేషన్ నుంచి ఫలితాల వరకు పార్టీ అభ్యర్థులకు అండగా నిలవాలని సజ్జల కోరారు. అభ్యర్థుల పేర్లు, గుర్తులు, ప్రచార కార్యక్రమాలు, స్థానిక సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉంటూ విమర్శల్లో విషయం, ఆధారాలు ఉండాలి.. భాష హుందాగా ఉండాలి అని స్పష్టం చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ఆవేశంతో స్పందించి కేసులకు అవకాశం ఇవ్వవద్దన్నారు. సోషల్ మీడియా అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి మాట్లాడుతూ, గత రెండేళ్లలో కేసులు ఎదుర్కొన్న కార్యకర్తలకు పార్టీ నాయకత్వం, లీగల్ సెల్ అండగా నిలిచాయని తెలిపారు. లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి కూడా వాస్తవాలు, ఆధారాలతోనే ప్రజా సమస్యలను వివరించాలని సూచించారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శులు లేళ్ల అప్పిరెడ్డి, పూడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికలను సోషల్ మీడియా సామర్థ్యానికి పరీక్షగా తీసుకుని వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని నాయకులు పిలుపునిచ్చారు.
#YSRCP #SajjalaRamakrishnaReddy #YSRCPSocialMedia #LocalBodyElections #AndhraPradeshPolitics #SocialMediaStrategy #PoliticalCampaign #GrassrootsNetwork #PublicIssues #ElectionMonitoring #DoddaAnjireddy #Tadepalli #APPolitics #APNews











