సముద్రంలో 300 నాటికల్ మైళ్ల గాలింపు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఓడలరేవు ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు మత్స్యకారులను సురక్షితంగా తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 3న ‘ముత్యాలమ్మ’ బోటులో వేటకు వెళ్లిన కోపనాతి రామకృష్ణ, కొల్లాటి యేసుదాసు, పాలేపు సంతోషరావు, కర్రి రాంబాబు, కొల్లాటి శ్రీనుబాబు, సంగడి తాతారావు, పోనాడి సతీష్ తిరిగి రాలేదు. ఆగస్టు 17న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు ప్రారంభమైంది. ప్రస్తుతం కోస్ట్‌గార్డ్‌కు చెందిన ఐదు నౌకలు, నేవీకి చెందిన రెండు నౌకలు, రెండు విమానాలు రంగంలోకి దిగాయి.
పారాదీప్ సమీపంలో బోటు గుర్తింపు
గల్లంతైన బోటు ఆచూకీ కోసం సుమారు 300 నాటికల్ మైళ్ల పరిధిలో సముద్రాన్ని జల్లెడ పడుతున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ సహా తీర ప్రాంత రక్షణ విభాగాలతో సమన్వయం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఒడిశాలోని పారాదీప్‌కు సుమారు 15 నాటికల్ మైళ్ల దూరంలో ‘ముత్యాలమ్మ’ పేరుతో పసుపు రంగు బోటు కనిపించినట్లు సమాచారం అందింది. అది గల్లంతైన బోటేనా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ప్రత్యేక బృందాన్ని పంపారు. బోటులో సుమారు 1,000 లీటర్ల డీజిల్, 20 రోజులకు సరిపడా ఆహారం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో మత్స్యకారులు క్షేమంగా ఉండే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని, మత్స్యకారులను సురక్షితంగా గుర్తించే వరకు గాలింపు ఆగదని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.
#FishermenMissing #AndhraPradesh #Konaseema #FishermenRescue #CoastGuard #IndianNavy #MutyalammaBoat #FishingBoat #MissingFishermen #BayOfBengal #Paradip #Atchannaidu #ChandrababuNaidu #PawanKalyan #APNews #FishermenSearch #RescueOperation











