Home Telangana కార్డులు-ఫోటోలు.. రాజకీయ రగడ రేషన్ కార్డులపై ఫొటోలెందుకు?

కార్డులు-ఫోటోలు.. రాజకీయ రగడ రేషన్ కార్డులపై ఫొటోలెందుకు?


రేవంత్‌ సర్కార్‌పై సునీత ఫైర్‌

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అబద్ధాలతో కూడుకున్నవని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆమె మాట్లాడుతూ ప్రజాధనంతో సభలు నిర్వహించి కేసీఆర్‌, హరీశ్‌రావుపై వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప రాష్ట్రాభివృద్ధిపై సీఎం స్పష్టమైన ప్రణాళిక చెప్పలేదని ఆరోపించారు. మిషన్‌ భగీరథ ద్వారా కేసీఆర్‌ ఇంటింటికీ తాగునీరు అందించారని, దాన్ని నిర్వీర్యం చేసిన ఘనత రేవంత్‌ ప్రభుత్వానిదేనన్నారు. రేషన్‌ కార్డుల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ హయాంలో 6.47 లక్షల రేషన్‌ కార్డులు ఇచ్చినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శాసనమండలిలోనే చెప్పారని గుర్తుచేశారు. రేషన్‌ కార్డులపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ ఫొటోలు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. సన్నబియ్యం పంపిణీ తమ ఘనత కాదని, దానికి కేసీఆర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అని వ్యాఖ్యానించారు.

రైతులు, నిరుద్యోగులపై ప్రశ్నలు

రైతులకు 12 గంటల విద్యుత్‌ కూడా అందడం లేదని ఆరోపించిన సునీతా లక్ష్మారెడ్డి, రైతు రుణమాఫీ, రైతుభరోసా, బోనస్‌ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. యూరియా యాప్‌తో రైతుల కష్టాలు పెరిగాయని అన్నారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సిగాచి ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రకటించిన పరిహారం ఇంకా అందలేదని ఆరోపించారు. సంగారెడ్డికి వచ్చిన సీఎం జిల్లాకు నిధులు ఇవ్వకుండా వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యారని మండిపడ్డారు. కళ్యాణలక్ష్మిని ఎత్తివేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. హరీశ్‌రావుపై సీఎం చేసిన క్షుద్ర పూజల వ్యాఖ్యలను కూడా ఆమె తప్పుబట్టారు. సీఎం హోదాలో ఇలాంటి మాటలు సరికావని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని అన్నారు.

 

#SunitaLakshmaReddy #RevanthReddy #RationCards #RationCardPhotos #BRS #Congress #TelanganaPolitics #KCR #HarishRao #MissionBhagiratha #RythuBharosa #FarmerLoanWaiver #KalyanaLakshmi #TelanganaWelfare #TelanganaNews