ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ హంగామా
తెలంగాణలో యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, హెచ్‌సీఏ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ 2026 తొలి సీజన్‌కు సర్వం సిద్ధమైంది. జూన్ 21 నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ లీగ్‌కు టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండగా, శ్రీనిధి యూనివర్సిటీ టైటిల్ స్పాన్సర్‌గా నిలిచింది. మొత్తం 8 జట్లు తలపడే ఈ టోర్నీలో లీగ్ దశ ముగిసేసరికి టాప్-4లో నిలిచిన జట్లు ప్లే-ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. జూలై 12న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్, అన్విత ఖమ్మం ఏసెస్ జట్లు తలపడనున్నాయి.
అట్టహాసంగా ప్రారంభ వేడుకలు.. భారీ ప్రైజ్ మనీ
మంగళవారం బేగంపేట్‌లో జరిగిన మీడియా సమావేశంలో హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ ఆగం రావు లీగ్ వివరాలను వెల్లడించారు. విజేతగా నిలిచిన జట్టుకు రూ. 1 కోటి, రన్నరప్‌కు రూ. 50 లక్షలు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు రూ. 25 లక్షల చొప్పున ప్రైజ్‌మనీ అందజేయనున్నారు. ప్రారంభ మ్యాచ్‌కు ముందు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజికల్ కాన్సర్ట్, లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మినహా ఐపీఎల్ నిబంధనలనే ఇక్కడ అమలు చేయనున్నారు. మ్యాచ్ టికెట్ ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచుతూ రూ. 50, రూ. 100గా నిర్ణయించారు. ఈ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ తెలుగు, జియోహాట్‌స్టార్ యాప్‌లలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.










