సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం
భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ప్రత్యర్థి ఆటగాడిని నెట్టేసిన ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో వైభవ్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. భారత్-ఏ కెప్టెన్ తిలక్ వర్మ ప్రత్యర్థి జట్టుపై మండిపడుతూ వైభవ్‌కు అండగా నిలిచినట్లు కొందరు ఆకతాయిలు తప్పుడు వార్తలను సృష్టించారు. శ్రీలంక ఆటగాళ్లు మ్యాచ్ పొడవునా దూషించారని, హద్దులు దాటడం వల్లే వైభవ్ గట్టిగా బదులిచ్చాడని తిలక్ వర్మ అన్నట్లు ప్రచారం చేశారు. అయితే మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ బ్రాడ్‌కాస్టర్లతో అసలు మాట్లాడలేదని, ఈ గొడవపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తేలింది.
కోచ్ పేరిట కూడా అబద్ధపు పోస్ట్‌లు
తిలక్ వర్మతో పాటు వైభవ్ సూర్యవంశీ చిన్ననాటి కోచ్ పేరిట కూడా ఒక ఫేక్ పోస్ట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. శ్రీలంక ఆటగాళ్లు వైభవ్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తూ పదే పదే రెచ్చగొట్టడం వల్లే అతను అలా స్పందించాల్సి వచ్చిందని, అతనికి అందరూ అండగా నిలబడాలని కోచ్ చెప్పినట్లు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారు. నెటిజన్లు నిజానిజాలు తెలియక ఈ ఫేక్ పోస్ట్‌లను విపరీతంగా షేర్ చేస్తున్నారు. మైదానంలో నిగ్రహం కోల్పోయిన వైభవ్‌పై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉండగా, మాజీ క్రికెటర్లు సైతం అతని ప్రవర్తనను తప్పుబడుతూ ఆటపైనే దృష్టి పెట్టాలని హితవు పలుకుతున్నారు.











