రేవంత్ రెడ్డి అసత్య ప్రచారమన్న కేంద్ర మంత్రి
రేవంత్ రెడ్డి లేఖకు ముందు ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును తాను అడ్డుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ఏడేళ్లుగా కేంద్ర మంత్రిగా తాను తెలంగాణ ప్రయోజనాల కోసమే పనిచేశానని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి చెబితే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులను ఆపదని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు.
మెట్రో ఫేజ్-2 కు సూత్రప్రాయ అంగీకారం
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 50:50 నిష్పత్తి భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి స్వయంగా ముఖ్యమంత్రికి తెలిపారన్నారు. గతంలో మెట్రో ఫేజ్-1 ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 1,250 కోట్లు అందించిందని, ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగానే అది ప్రారంభమైందని గుర్తుచేశారు. తెలంగాణ అభివృద్ధి పట్ల తమకు పూర్తి చిత్తశుద్ధి ఉందని, దీనికోసం కాంగ్రెస్ పార్టీ సర్టిఫికెట్లు తమకు అస్సలు అవసరం లేదన్నారు.
ఐఆర్‌ఎఫ్‌సీ రుణ నిబంధనలపై స్పష్టత
రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్‌ఎఫ్‌సీ సంస్థతో కుదుర్చుకున్న రూ. 13,500 కోట్ల రుణ ఒప్పందం విషయంలో తానేనాడూ జోక్యం చేసుకోలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే మెట్రో ఆదాయం నుంచి ముందుగా ఐఆర్‌ఎఫ్‌సీ రుణాలను చెల్లించేలా రేవంత్ రెడ్డి నిబంధనలు పెట్టారని, దానిపైనే కేంద్రం కొన్ని సాంకేతిక సూచనలు చేసిందని వివరించారు. దేశవ్యాప్తంగా ఏ మెట్రో సంస్థ కూడా అప్పులను ముందే కట్టదని, వచ్చే ఆదాయాన్ని మొదట ఆపరేషన్స్, మెయింటెనెన్స్ కోసం ఖర్చు చేయాలని సూచించారు. అప్పుడే మెట్రో నిలదొక్కుకుంటుందని తాము చెబుతుంటే ముఖ్యమంత్రి అంగీకరించడం లేదన్నారు.
సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్ర
కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇదంతా చేస్తోందని కేంద్ర మంత్రి ఆరోపించారు. గతంలో కేసీఆర్ అలైన్‌మెంట్ మార్పు పేరుతో మూడేళ్లు కాలయాపన చేస్తే, నేడు రేవంత్ రెడ్డి కూడా అదే తీరుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీల అమలును గాలికొదిలేసి ప్రతిపక్షాలపై పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణకు ఒక రూపాయి వచ్చినా సంతోషపడే మొదటి వ్యక్తిని తానేనని, ఈ ప్రాజెక్టు సమస్యను పరిష్కరించడానికి కేంద్ర మంత్రితో నిర్వహించే సమావేశానికి ముఖ్యమంత్రితో కలిసి వచ్చేందుకు తనకు ఎలాంటి భేషజాలు లేవని కిషన్ రెడ్డి ప్రకటించారు.











